బజాజ్‌ నుంచి ఆరోగ్య సంజీవని పాలసీ

Arogya Sanjeevani Policy From Bajaj Allianz General Insurance - Sakshi

ఎన్నో సమస్యలకు విస్తృత కవరేజీ

పుణే: బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘ఆరోగ్య సంజీవని’ పేరుతో ఓ ఆరోగ్య బీమా పాలసీని నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఆర్‌డీఏఐ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకొచ్చిన పాలసీ ఇదని కంపెనీ పేర్కొంది. అన్ని బీమా సంస్థలు ఓ ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీని తప్పనిసరిగా ఆఫర్‌ చేయాలన్నది ఐఆర్‌డీఏఐ ఆదేశం. అంటే ఈ ప్రామాణిక పాలసీ కింద అన్ని బీమా సంస్థల్లోనూ ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. బజాజ్‌ అలియాంజ్‌ నుంచి వచ్చిన ఆరోగ్య సంజీవని పాలసీలో కవరేజీ రూ.1–5 లక్షల మధ్య ఉంటుంది. వ్యక్తి తన పేరిట, అలాగే, తన జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామల పేరిట ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని సైతం తీసుకోవచ్చు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే పరిహారాన్ని కంపెనీ చెల్లిస్తుంది.

ఆన్‌లైన్‌ వేదికగా కోవిడ్‌–19 పాలసీల ఆఫర్లు
కోల్‌కతా: కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వ్యాప్తి పరిస్థితులను బీమా సంస్థలు వ్యాపార అవకాశాలుగా మలుచుకుంటున్నాయి. వైరస్‌ నుంచి రక్షణ కల్పించే హెల్త్‌ పాలసీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందుకోసం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ రెండు రకాల కోవిడ్‌–19 పాలసీలను తీసుకొచ్చింది. ఇందులో ఒకటి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో రూ.25వేల పరిహారం అందించే పాలసీ ఒకటి. మరో పాలసీలో రోజువారీ పరిహారం రూ.500 నుంచి మొదలవుతుంది. ఈ పాలసీల కోసం ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ టైఅప్‌ అయింది. అదే విధంగా బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ కూడా ఫోన్‌పే భాగస్వామ్యంతో ‘కరోనాకేర్‌’ పేరిట ఓ పాలసీని ఆఫర్‌ చేస్తోంది. కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఈ పాలసీ కింద పరిహారం లభిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top