విస్తీర్ణం తగ్గింది!

Areas of new apartments in construction companies in cities - Sakshi

ఏడాదిలో 15–17 శాతం తగ్గిన ఫ్లాట్ల ఏరియా ∙హైదరాబాద్‌లో మాత్రం వృద్ధి

దేశంలో నివాస సముదాయాల విస్తీర్ణాలు తగ్గాయి. ఏడాది కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో ఫ్లాట్ల సేలబుల్‌ ఏరియా 15–17 శాతం వరకు క్షీణించాయి. డెవలపర్లు కొత్త అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు తగ్గించి.. ధరలను మరింత అందుబాటులోకి తీసు కొచ్చారని ప్రాపర్టీ టెక్నాలజీ సేవల కంపెనీ స్క్వేర్‌ యార్డ్స్‌ తెలిపింది. 

సాక్షి, హైదరాబాద్‌: గత రెండేళ్లుగా గుర్గావ్, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా, ముంబై, నోయిడా, హైదరాబాద్‌ నగరాల్లోని నిర్మాణ సంస్థలు కొత్త అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు తగ్గిస్తున్నాయి. 2017లో 1130 చ.అ.లుగా ఉన్న 2 బీహెచ్‌కే ఫ్లాట్‌ సేలబుల్‌ ఏరియా.. 2018 నాటికి 963 చ.అ.లకు తగ్గింది. 2017లో 1754 చ.అ.లుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్‌ సేలబుల్‌ ఏరియా.. 2018 నాటికి 1458 చ.అ.లకు తగ్గింది. అంటే 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో 15 శాతం, 3 బీహెచ్‌కేలో 17 శాతం వరకూ సేలబుల్‌ ఏరియా విస్తీర్ణం తగ్గిందన్నమాట. 

పెట్టుబడికి విలువ.. 
రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టం కార్పెట్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియాలపై స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది. ఫ్లాట్ల ధరలను కార్పెట్‌ ఏరియా ప్రాతిపదికన కాకుండా సేలబుల్‌ ఏరియా ప్రకారం నిర్ణయించాలని తెలిపింది. దీంతో దేశంలోని వేర్వేరు మెట్రో నగరాల్లో అపార్ట్‌మెంట్ల ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు డెవలపర్లకు అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలను తగ్గించి నిర్మాణాలు చేపడుతున్నారు. సేలబుల్‌ ఏరియాను తగ్గించడంతో లే అవుట్‌లో ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుంది. దీంతో కొనుగోలుదారుల చేతిలో ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుంది.

హైదరాబాద్‌లో వృద్ధి; ముంబైలో క్షీణత
మెట్రో నగరాల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలు తగ్గుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం పెరుగుతున్నాయి. ఏడాదిలో నగరంలో 2 బీహెచ్‌కే విస్తీర్ణంలో 2 శాతం, 3 బీహెచ్‌కేలో 1 శాతం వృద్ధి నమోదైంది. 2017లో 1261 చ.అ.లుగా ఉన్న 2 బీహెచ్‌కే సేలబుల్‌ ఏరియా.. 2018 నాటికి 1291 చ.అ.కి, 1919 చ.అ.గా ఉన్న 3 బీహెచ్‌కే 1935 చ.అ.లకు పెరిగాయి. ఇక, ఫ్లాట్ల విస్తీర్ణాల తగ్గింపులో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. 2 బీహెచ్‌కేలో 25 శాతం, 3 బీహెచ్‌కేలో 26 శాతం తగ్గుముఖ పట్టాయి. ముంబైలో 2 బీహెచ్‌కే 1084 చ.అ. నుంచి 809 చ.అ.లకు, 3 బీహెచ్‌కే 1710 చ.అ. నుంచి 1265 చ.అ.లకు తగ్గింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top