త్వరలోనే ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ నిలిపివేత?

Apple May Discontinue iPhone X, iPhone SE Soon - Sakshi

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ మరికొన్ని నెలల్లో తన మెగా హార్డ్‌వేర్‌ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఆ ఈవెంట్లో గత ఎంతో కాలంగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న కొత్త ఐఫోన్లను కంపెనీ లాంచ్‌ చేయబోతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు 2018లో భారీ ఎత్తున్న డిమాండ్‌ వచ్చే అవకాశాలున్నాయని కూడా టెక్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. అయితే వీటికి డిమాండ్‌ భారీ ఎత్తున్న ఉండబోతున్న తరుణంలో, ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేసిన ఐఫోన్‌ ఎక్స్‌ను, ఐఫోన్‌ ఎస్‌ఈ లను నిలిపివేస్తుందని టెక్‌ విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా కొత్తగా విడుదల చేయబోతున్న ఆ మూడు ఐఫోన్లపైనే ఉంచనున్నట్టు పేర్కొంటున్నారు. 

బ్లూఫిన్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన ఓ ఇన్వెస్టర్‌ నోట్‌లో.. గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్‌గ్రేడ్‌ లేకపోవడంతో, తాజాగా తీసుకొచ్చే ఐఫోన్లకే ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని తెలిసింది. ఆపిల్‌ ఆ మెగా ఈవెంట్‌లో 5.8 అంగుళాల ఐఫోన్‌ ఎక్స్‌ సక్ససర్‌, 6.5 అంగుళాల ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌ మోడల్‌,  అఫార్డబుల్‌ 6.1 అంగుళాల ఎల్‌సీడీ ఐఫోన్‌ను లాంచ్‌ చేస్తుంది. అఫార్డబుల్‌ ఎల్‌సీడీ ఐఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్‌ వస్తుందని చాలా కాలం నుంచే విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2018 మూడు, నాలుగు క్వార్టర్లలో 9.1 కోట్ల యూనిట్ల 2018 ఐఫోన్‌ను తయారు చేస్తుందని బ్లూఫిన్‌ విశ్లేషకులు చెప్పారు. మరో 9.2 కోట్ల యూనిట్లను 2019 తొలి రెండు క్వార్టర్లలో రూపొందిస్తుందని పేర్కొన్నారు. షిప్‌మెంట్లను కూడా భారీగానే చేపట్టనుందని తెలిపారు. 

ఐఫోన్‌ ఎక్స్‌ ధర(999 డాలర్లు) మాదిరే ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌ ధరను నిర్ణయిస్తుందని, అదేమాదిరి మూడు ఐఫోన్లలో కెల్లా 6.1 అంగుళాల ఎల్‌సీడీ ఐఫోన్‌ ధరనే అత్యంత తక్కువగా ఉంచనుందని తెలుస్తోంది.  దీని ధర 600 డాలర్ల నుంచి 700 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ఇది ఐఫోన్‌ ఎస్‌ఈని రీప్లేస్‌ చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లను లాంచ్‌ చేయబోతున్న తరుణంలో, ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ ఎస్‌ఈలను నిలిపివేయబోతున్నట్టు విశ్లేషకులంటున్నారు. ఒకవేళ ఐఫోన్‌ ఎక్స్‌ను కనుక ఆపిల్‌ నిలిపివేస్తే, లాంచ్‌ అయిన ఏడాదిలో నిలిచిపోయిన ఫోన్‌ ఇదే అవుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top