రూ.2కే ‘స్పైస్‌’జెట్‌! | Sakshi
Sakshi News home page

రూ.2కే ‘స్పైస్‌’జెట్‌!

Published Thu, Jul 6 2017 12:53 AM

రూ.2కే ‘స్పైస్‌’జెట్‌!

టిక్కెట్టు కాదండీ... కంపెనీయే జాక్‌పాట్‌ కొట్టేసిన అజయ్‌ సింగ్‌
చరిత్రలో అత్యంత చౌకగా చేతులు మారిన లిస్టెడ్‌ కంపెనీ ఇదే
15 రోజుల్లోనే యాజమాన్య హక్కుల బదలాయింపు
స్టాక్‌ మార్కెట్లకు ధర వెల్లడించకుండానే డీల్‌ పూర్తి
రెండున్నరేళ్ల తర్వాత కోర్టు జోక్యంతో వెలుగులోకి  


(న్యూఢిల్లీ)
రెండు రూపాయలకు ఏం వస్తాయో ఒకసారి ఠక్కున చెప్పండి చూద్దాం.. పిప్పర్‌మెంటో, చాక్లెట్టో తప్ప మరే భారీదీ గుర్తుకురావడం లేదు కదా!! అలాంటిది .. బోలెడన్ని విమానాలు, ఆస్తులు.. (అఫ్‌కోర్స్‌ అప్పులు కూడా ఉన్నా) ఒక పెద్ద విమానయాన కంపెనీ రెండే రూపాయలకు అమ్ముడైపోయిందన్న సంగతి మీకు తెలుసా!! ఆ కంపెనీ మరేదో కాదు.. స్పైస్‌జెట్టే!! అంత చౌకగా దాన్ని దక్కించుకున్నది ఆ కంపెనీ ఒకప్పటి వ్యవస్థాపకుడు, ప్రస్తుత చైర్మన్‌ అజయ్‌ సింగ్‌.

సుమారు రెండున్నరేళ్ల క్రితం మూసివేతకు సిద్ధంగా ఉన్న చౌక టికెట్ల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను అప్పట్లో మళ్లీ తన చేతుల్లోకి తీసుకున్నారు సంస్థ వ్యవస్థాపకుడు అజయ్‌ సింగ్‌. కంపెనీని నిలబెట్టారు. క్రమంగా మళ్లీ లాభాల బాట పట్టించారు. అయితే, స్పైస్‌జెట్‌ను మారన్‌ల నుంచి కొనుగోలు చేసేందుకు సింగ్‌ ఎంత చెల్లించారన్నది తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. స్పైస్‌జెట్‌లో 58.46% వాటాలను ఆయన కేవలం రూ.2కే  దక్కించుకున్నారు!! అవును! అక్షరాలా రెండే రూపాయలు!! దేశీ కార్పొరేట్‌ చరిత్రలో ఏ లిస్టెడ్‌ కంపెనీ కూడా ఇలాంటి ధరకు అమ్ముడవలేదు.

2015 జనవరిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తయిపోయిన ఈ డీల్‌కు.. ఓపెన్‌ ఆఫర్‌ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సింగ్‌కు వెసులుబాటు లభించింది. అప్పట్లో ఇది బయటకు కూడా రాలేదు!!. కానీ.. సుమారు రెండున్నరేళ్ల తర్వాత బయటికొచ్చిన ఈ విషయాలు మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అప్పట్లో స్పైస్‌జెట్‌ షేరు ధర రూ. 21.8గా ఉండేది. దాని ప్రకారం చూస్తే ప్రమోటర్‌ మారన్‌ వాటా విలువ  రూ.765 కోట్లు. కానీ దీన్ని సింగ్‌ అత్యంత చౌకగా రెండే రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 125కి చేరింది. అంటే స్పైస్‌జెట్‌లో సింగ్‌ వాటాల విలువ ప్రస్తుతం సుమారు రూ.4,400 కోట్ల మేర ఉంటుంది.

బయట పడిందిలా..
అప్పట్లో డీల్‌ విలువ గురించి ఇటు సింగ్, స్పైస్‌జెట్, అటు మారన్‌ ఎవరూ కూడా బైటపెట్టలేదు. లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించిన ప్రతి  విషయమూ ఇన్వెస్టర్లకు తెలిసి తీరాల్సిందే అనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ వివరాలు వెల్ల డించాలని ఆదేశించలేదు. ఆ విధంగా అసలు డీల్‌ విలువ ఎంతనేది ఎవ్వరికీ తెలియకుండా ఒక లిస్టెడ్‌ కంపెనీ చేతులు మారిపోయింది. నిజానికి ఈ డీల్‌ విలువ రూ.2 అని అప్పట్లో మార్కెట్లో తెలిస్తే చరిత్ర వేరే విధంగా ఉండేదన్నది విశ్లేషకుల మాట.

ఎందుకంటే కేవలం రెండ్రూపాయలకు స్పైస్‌జెట్‌ను ప్రమోటర్‌ విక్రయించేశారంటే దానికి విలువ లేదనేగా అర్థం!! అపుడు ఇన్వెస్టర్లు కూడా తమ షేర్లను అమ్ముకుని బయటపడటానికి ప్రయత్నించి ఉండేవారు. అదే జరిగితే షేరు ధర కుప్పకూలేది. కానీ డీల్‌ విలువ బయటపడకపోవటంతో సింగ్‌ చేతుల్లోకి కంపెనీ వెళ్తోందని తెలిసిన దగ్గరి నుంచీ షేరు ధర పెరగటం మొదలెట్టింది. డీల్‌ నిబంధనలను సింగ్‌ గౌరవించడం లేదంటూ మారన్‌ న్యాయపోరాటం సాగిస్తున్న దరిమిలా ఈ సమాచారం బయటికొచ్చింది. దీన్ని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం స్పైస్‌జెట్‌ యాజమాన్య హక్కులు కేవలం 14 రోజుల్లో మారన్, కాల్‌ ఎయిర్‌వేస్‌ నుంచి సింగ్‌ చేతికి వచ్చాయి.
 
అప్పులు, నష్టాల నుంచి లాభాల్లోకి ..
ప్రస్తుతం మళ్లీ లాభాలు కళ్లజూస్తున్న స్పైస్‌జెట్‌... సుమారు రెండున్నరేళ్ల క్రితం 2014 డిసెంబర్‌లో నిధుల కటకటతో మూసివేత అంచున నిలబడింది. బాకీలు కట్టలేక చేతులెత్తేసింది. 2014–15లో కంపెనీ నష్టం రూ.687 కోట్లు. అదే ఏడాది నికర విలువ కూడా తుడిచిపెట్టుకుపోయి మైనస్‌ రూ.1,329 కోట్లకు పడిపోయింది. మొత్తం రుణ భారం రూ.1,418 కోట్లు కాగా, స్వల్పకాలిక వ్యవధుల కోసం తీసుకున్న రుణాలు రూ. 2,000 కోట్ల మేర ఉండేవి. కంపెనీని గట్టెక్కించే వ్యూహాత్మక ఇన్వెస్టర్ల కోసం ప్రమోటర్‌ మారన్‌ కుటుంబం అన్వేషించింది. చివరికి సింగ్‌ ముందుకొచ్చి కంపెనీని టేకోవర్‌ చేశారు. నష్టాలకు అడ్డుకట్ట వేసి మళ్లీ క్రమంగా లాభాల్లోకి మళ్లించారు.

ఓపెన్‌ ఆఫర్‌ మినహాయింపు...!
సెబీ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థను టేకోవర్‌ చేసి, యాజమాన్య హక్కులు దక్కించుకునేవారు కచ్చితంగా మిగతా పబ్లిక్‌ షేర్‌హోల్డర్లకు వైదొలిగే వెసులుబాటు కల్పిస్తూ ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాలి. కానీ స్పైస్‌జెట్‌ కేసులో మాత్రం ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం 1937 కింద డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌... 26% ఓపెన్‌ ఆఫర్‌ నుంచి సింగ్‌కు అసాధారణంగా మినహాయింపునిచ్చింది. సెబీని కాదని  ఇలా మినహాయింపునిచ్చే హక్కు ఉందా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.

Advertisement
 
Advertisement
 
Advertisement