విమానంలో వాచిపోయేలా కుట్టిన నల్లులు, అయినా..

Air India Offers Waiver Not Refund To Traveller After Picture Of Bed Bug Bites - Sakshi

ముంబై : ఎయిరిండియా విమానమెక్కాలంటే.. ఇప్పుడందరూ వామ్మో అంటున్నారు. నల్లుల బెడదతో ప్రయాణికులు హడలిపోతున్నారు. అది కూడా బిజినెస్‌ క్లాస్‌లో అయ్యే సరికి ఎయిరిండియా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. వారం క్రితం న్యూజెర్సీ నుంచి ముంబై వస్తున్న సౌమ్య శెట్టీ అనే మహిళా ప్రయాణికురాలికి నల్లులు చుక్కులు చూపించాయి. చేయి, కాలు, మెడ వాచిపోయేలా కుట్టాయి. ఆమెను మాత్రమే కాక, తన ముగ్గురు పిల్లలు నల్లుల నుంచి పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఆ మహిళా ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ఇంటర్నెట్‌లో షేర్‌ చేసింది. నల్లులు కుట్టడం వల్ల దద్దుర్లు ఎక్కిన చేతితో కూడిన ఓ ఫోటోను, ఆమె ఎదుర్కొన్న తిప్పలను, ఎయిరిండియా నిర్లక్ష్యాన్ని ట్విటర్‌లో కడిగిపారేసింది. ల్యాండింగ్‌కు 30 నిమిషాల ముందు కూడా తనకు కనీసం సీట్లు మార్చుకునే అవకాశం ఇవ్వలేదని ట్విటర్‌ ద్వారా తన బాధను వెల్లబుచ్చుకుంది.

‘ముగ్గురు పిల్లలతో కలిసి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించడం నాకు సాయపడుతుంది అనుకున్నా. కానీ మమల్ని నల్లులు చేతిలు వాచిపోయేలా కుట్టాయి. అది చాలా బాధకరమైన రోజు. అయినప్పటికీ నేను అదే సీట్లో పడుకోవాల్సి వచ్చింది. తర్వాత రోజు ల్యాండింగ్‌ అయ్యే సమయంలో మా సీట్లను మార్చారు. ఇది చాలా ఘోరం! ముగ్గురు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న విషయం మీకు అర్థమవుతుందా?’ అంటూ ఎయిరిండియాను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేసింది. అంతేకాక బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్లకు వెచ్చించిన తన మొత్తం మనీని రీఫండ్‌ చేయాలని ఎయిరిండియాను డిమాండ్‌ చేసింది. ఇదే విషయంపై మంగళవారం ఎయిరిండియా హెల్ప్‌లైన్‌ నెంబర్లకు కాల్‌ చేసి, ఈ-మెయిల్‌ కూడా పంపింది. కానీ ఎయిరిండియా నుంచి ఆమెకు ఎలాంటి స్పందన రాలేదు. 

దీంతో దగ్గర్లో ఉన్న ఎయిరిండియా ఆఫీసుకు వెళ్లి అడిగితే, తప్పుడు ఈ-మెయిల్‌ ఐడీకి ఫిర్యాదు పంపించినట్టు ఆమెపైనే నెట్టేశారు. అయితే టిక్కెట్‌ ఛార్జీ మొత్తాన్ని తాము రీఫండ్‌ చేయలేమంటూ ఎయిరిండియా తేల్చిచెప్పింది. కేవలం టిక్కెట్లను రద్దు చేసుకునే పెనాల్టీ ఫీజు నుంచి మాత్రమే మినహాయింపు ఇస్తామంటూ చెప్పింది. తనకు టిక్కెట్ల మొత్తం రీఫండ్‌ కావాలని కోరితే, ఇలా నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరించడంపై సౌమ్య మండిపడింది. తర్వాత సౌమ్య శెట్టీ మెయిల్‌కు సమాధానమిచ్చిన ఎయిరిండియా యాజమాన్యం తాము పరిహారం కానీ, రీఫండ్‌ గురించి కానీ ఎక్కడ తెలుపలేదని, ఎయిర్‌క్రాఫ్ట్‌లో నల్లుల ప్రవేశంపై విచారణ చేపట్టామని తెలిపింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటామని పేర్కొంది. సౌమ్యకు, తన పిల్లలకు ఈ  నల్లులు కుట్టడం వల్ల 10వేల డాలర్ల మేర ఖర్చు అయిందని సౌమ్య భర్త కూడా ట్విటర్‌ ద్వారా ఈ విమానయాన సంస్థకు తెలిపాడు. దానికి బాధ్యత ఎవరంటూ కడిగిపారేశాడు. సౌమ్యకు మాత్రమే కాక, ఇదే రకమైన పరిస్థితి ఇటుఎయిరిండియా విమానంలో న్యూయార్క్‌ నుంచి ప్రయాణించిన మరో ప్రయాణికుడికి కూడా ఎదురవడం,  ఈ విమానయాన సంస్థను మరింత ఇరకాటంలో పడేసింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top