ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్ ‌: సొమ్ము మాయం

AIIMS falls prey to banking fraud loses over Rs12 crore; SBI issues alert to all its branches - Sakshi

ఎయిమ్స్‌కు  చెందిన రెండు ఖాతాలనుంచి  రూ. 12 కోట్లు మాయం

 అన్ని శాఖలను అప్రమత్తం  చేసిన ఎస్‌బీఐ

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌. ఎస్‌బీఐ ఖాతాల్లో డబ్బులు అనూహ‍్యంగా మాయమైపోతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నకిలీ (క్లోన్‌) చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీంతో ఎస్‌బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. పెద్దమొత్తంలో ఉన్న నాన్‌ హోం (ఎస్‌బీఐయేతర) చెక్కుల క్లియరింగ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ వాట్సాప్ సమాచారాన్ని తన ఉద్యోగులకు  అందిస్తోంది.

వివరాల్లోకి వెళితే, ఎయిమ్స్‌ కు చెందిన ఎస్‌బీఐ రెండు ఖాతాల్లోని 12 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము గల్లంతైనట్టు గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి రూ .7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్‌కు చెందిన మరో ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా తరలిపోయాయి. గత రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది. అధీకృత సంతకాలులేని నకిలీ చెక్కులకు చెల్లింపులు చేయడంలోని వైఫల్యానికి ఆయా శాఖలే కారణమని ఎయిమ్స్‌ వాదించింది. ప్రోటోకాల్‌ను అనుసరించడంలో ఎస్‌బీఐ విఫలమైందని,  తాము పోగొట్టుకున్ననగదును జమ చేయాలని బ్యాంకును కోరింది.

ఈ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని సంప్రదించాయి. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ మోసం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా, గత వారం డెహ్రాడూన్ (రూ .20 కోట్లకు పైగా)‌, ముంబైలో ఎస్‌బీఐ నాన్-హోమ్ శాఖల నుంచి (రూ.9 కోట్లు) క్లోన్ చెక్కుల ద్వారా రూ .29 కోట్లకు పైగా నగదును అక్రమంగా విత్‌డ్రా చేసుకునే ప్రయత్నాలు జరిగాయని పీటీఐ పేర్కొంది.

బ్యాంకు సూచనల మేరకు ఏదైనా నాన్-హోమ్ బ్రాంచ్‌లో నుంచి రూ. 2 లక్షలకుపైగా విలువైన చెక్‌ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి లేదా డబ్బు బదిలీ చేయడానికి ముందు ధృవీకరణ కోసం కస్టమర్‌ను సంప్రదించాలని ఎస్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు.  అయితే రూ. 25 వేలకు పైన లావాదేవీలను కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు.  అలాగే రూ. 3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, బ్యాంక్ సీబీఐకి  ఫిర్యాదు చేస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top