వైజాగ్‌–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు ఏడీబీ రుణం

వైజాగ్‌–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు ఏడీబీ రుణం


375 మిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: సుమారు 800 కి.మీ. పొడవున తలపెట్టిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) 375 మిలియన్‌ డాలర్లు రుణం, గ్రాంట్‌ రూపంలో అందజేయనుంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం, ఏడీబీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2,500 కి.మీ. పొడవున ప్రతిపాదిత ఈస్ట్‌ కోస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌ నిర్మాణం తొలి దశలో వైజాగ్‌–చెన్నై కారిడార్‌ను నిర్మించనున్నారు. కారిడార్‌లో నాలుగు ప్రధాన కేంద్రాలైన వైజాగ్, కాకినాడ, అమరావతి, ఏర్పేడు–శ్రీకాళహస్తిలో మౌలికసదుపాయాల కల్పన కోసం రుణాలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఏడీబీ తెలిపింది.


తొలి విడత కింద 245 మిలియన్‌ డాలర్లతో విశాఖపట్నం, ఏర్పేడు–శ్రీకాళహస్తిలో అధునాతన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరో 125 మిలియన్‌ డాలర్ల రుణాలు విధానపరమైన తోడ్పాటు కోసం దక్కనున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే విధానాలను ప్రోత్సహించేందుకు, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే చర్యలకు, కారిడార్‌ నిర్వహణ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. వీటితో పాటు పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం అర్బన్‌ క్లైమేట్‌ చేంజ్‌ ట్రస్ట్‌ ఫండ్‌ నుంచి 5 మిలియన్‌ డాలర్లు దక్కనున్నాయి.



నిధుల వినియోగం ఇలా..

తొలి విడతగా లభించే 245 మిలియన్‌ డాలర్లను కాకినాడ పోర్టు నుంచి 16వ నంబర్‌ జాతీయ రహదారికి మధ్య 29.6 కి.మీ. మేర కనెక్టివిటీని మెరుగుపర్చే దిశగా రహదారుల విస్తరణకు ఉపయోగించనున్నారు. అలాగే, విశాఖపట్నంలో నిరంతర నీటి సరఫరా కోసం స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో ఇన్వెస్ట్‌ చేయనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top