మూడు రోజులు శ్రీవారి దర్శనం ట్రయల్‌ రన్‌ | Sakshi
Sakshi News home page

మూడు రోజులు శ్రీవారి దర్శనం ట్రయల్‌ రన్‌

Published Tue, Jun 2 2020 6:38 PM

YV Subba Reddy Says Three Days Trial Run For Srivari Darshanam - Sakshi

సాక్షి, తాడేపల్లి : కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ నెల 8 నుంచి ట్రయల్ రన్‌‌ నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు భౌతిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు, స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత అధికారుల సూచనల మేరకు శ్రీవారి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. ప్రతి భక్తుడు శానిటైజేషన్‌ చేసుకోవడంతో పాటుగా, భౌతిక దూరం పాటించాలని సూచించారు.(చదవండి : శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌)

ఆన్‌లైన్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకున్నవారికి కూడా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీరికి అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతనే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి పుష్కరిణిలో భక్తుల స్నానానికి అనమతి లేదన్నారు. శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనాపై కేంద్రం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని కోరారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా మూతపడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తెరుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement
Advertisement