
సింగపూర్‌లో తెలుగువారితో సమావేశమైన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఎన్‌ఆర్‌ఐలు ఉద్యోగాలు కల్పించేలా ప్రాజెక్టులతో ఏపీకి రావాలని ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
సాక్షి, తిరుమల: ఎన్‌ఆర్‌ఐలు ఉద్యోగాలు కల్పించేలా ప్రాజెక్టులతో ఏపీకి రావాలని ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం సింగపూర్‌లో జరిగిన శ్రీనివాస కల్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు వైవీ సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. మౌలిక సదుపాయాలు, పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలియజేశారు.
రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి దోహదపడుతుందన్నారు. ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్రం వెనుకబడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సింగపూర్‌లో గాని తమ గ్రామాల్లో గాని ఏ సమస్య అయినా ఉందని చెబితే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని ఆయన భరోసానిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ డి.ప్రకాష్‌రెడ్డి, సభ్యులు మహేష్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్య, నాగరాజు, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.