ఉద్యమంపై ఉక్కుపాదం

YSRCP State Bandh Is Successful In Prakasam - Sakshi

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్న చంద్రబాబు సర్కారు, మరో వైపు హోదా ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జిల్లా బంద్‌ను పోలీసులను అడ్డుపెట్టి అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీస్‌ 30 యాక్ట్‌తో పాటు 144 సెక్షన్‌ను విధించింది. ప్రభుత్వం ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధమైన వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. గృహ నిర్బంధం, అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. బంద్‌ కారణంగా ఉదయం కొద్దిసేపు బస్సులు నడవలేదు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో కొందరు దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు సహకరించగా మరి కొందరు దుకాణాలు తెరిచారు. విద్యాసం్థలు మూసివేశారు. మొత్తంగా పోలీసుల నిర్భందంతో జిల్లాలో బంద్‌ పాక్షికంగా జరిగింది.

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న బంద్‌ పాల్గొనకుండా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. అనంతరం బాలినేని పార్టీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కెవి.రమణారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, వై.వెంకటేశ్వరరావు, రామానాయుడు, అంజిరెడ్డి, తదితర నేతలు, కార్యకర్తలతో కలిసి బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఇంటి ఆవరణలో పోలీసులు అడ్డుకున్నారు. బాలినేనిని చుట్టుముట్టిన పోలీసులు ఆయనను ఇంటి లోపలికి తరలించేందుకు ప్రయత్నించారు. దీనిని అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలతో పాటు పోలీసులు తొక్కిసలాటలో పడిపోయారు. అనంతరం బాలినేనితో పాటు కార్యకర్తలు అక్కడే బైటాయించారు.

ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోదా కోసం పోరాడుతుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు వారిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. సాయంత్రం వరకు బాలినేని గృహ నిర్భంధంలోనే ఉంచారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారని బాలినేని విలేకరుల సమావేశంలో విమర్శించారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణితోనే రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు. ఎంత మందిని నిర్భంధించి, అరెస్టులు చేసిన హోదా సాధించి తీరుతామన్నారు. బాలినేనిని గృహ నిర్భంధంలో ఉంచడాన్ని నిరసిస్తూ నేతలు, పార్టీ కార్యకర్తలు బాలినేని ఇంటి సమీపంలో ప్రధాన రహదారిపై రాస్తారొకో చేపట్టారు.

రాస్తారోకోకు నేతృత్వం వహించిన పార్టీ నేతలు కుప్పం ప్రసాద్, కెవి. రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు, యనమల నాగరాజు తదితరులను పోలీసులు అరెస్టు చేసి 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నగరంలో విద్యార్థి, మహిళా విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేశారు. దుకాణ దారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. తొలుత తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండులో బస్సులను అడ్డుకున్నారు. గంటపాటు బస్సులు నిలిచి పోయాయి. అనంతరం పోలీసులు సింగరాజును అరెస్టు చేసి జరుగుమల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
 
2 మార్కాపురంలో ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం పార్టీ శ్రేణులు మార్కాపురం ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని జంకే వెంకటరెడ్డితో పాటు పార్టీ నేత వెన్న హనుమారెడ్డి తదితరులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై వారి స్వగృహాలకు తరలించి హౌస్‌ అరెస్టు చేశారు.
 
2 యర్రగొండపాలెంలో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్‌ ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. తొలుత ఎమ్మెల్యేను మార్కాపురంలోని ఆయన స్వగృహంలో హౌస్‌ అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడి నుంచి యర్రగొండపాలెం వెళ్లారు.  ఎమ్మెల్యే బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నేతలు బంద్‌ నిర్వహించారు. యర్రగొండపాలెంలో సంపూర్ణంగా బంద్‌ జరిగింది.

2 కందుకూరులో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూమాటి మాధవరావు బంద్‌లో పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మహీధర్‌రెడ్డితో పాటు తూమాటి మాధవరావును పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

2 అదంకిలో సమన్వయకర్త బాచిన గరటయ్య ఆధ్వర్యంలో హోదా బంద్‌ జరిగింది. ఉదయాన్నే గరటయ్యను జె పంగులూరులోని ఆయన స్వగృహంలో పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. దీంతో ఆయన కుమారుడు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో కార్యకర్తలు బంద్‌ నిర్వహించారు. పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

 
2 చీరాలలో సమన్వయకర్త యడం బాలాజి నేతృత్వంలో హోదా బంద్‌ జరిగింది. పోలీసులు ఉదయాన్నే   పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణిని హౌస్‌ అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు సమన్వయకర్త సురేష్‌ పాల్గొన్నారు.
 
2 దర్శిలో సమన్వయకర్త బాదం మాధవరెడ్డి ఆధ్వర్యంలో హోదా బంద్‌ జరిగింది. మాధవరెడ్డిని పోలీసులు సంతమాగూలూరులోని ఆయన స్వగృహంలో అరెస్టు చేశారు. దీంతో దర్శితో పాటు తాళ్లూరు, దొనకొండ, కురిచేడుతో పాటు అన్ని మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్‌ నిర్వహించారు. కురిచేడు పోలీస్‌ స్టేషన్‌ వద్ద పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు.
 
2 కనిగిరిలో సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు  బంద్‌ను నిర్వహించాయి. ఉదయాన్నే ఆర్టీసీ వద్ద నేతలు బస్సులను ఆపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పోలీసులు బుర్రాతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బంద్‌ జరిగింది.

2 గిద్దలూరులో సమన్వయకర్త ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఐవీరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డిలు ఆందోళన నిర్వహించారు. బస్సులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి వారి స్వగృహాలకు తరలించి హౌస్‌ అరెస్టు చేశారు. అనంతరం కార్యకర్తలు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పిడతల అభిషేక్‌ నిరసనలో పాల్గొన్నారు.
 
2 సంతనూతలపాడులో సమన్వయకర్త సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో హోదా బంద్‌ జరిగింది. ఆయనను ఒంగోలులోని నివాసంలో హౌస్‌ అరెస్టు చేశారు. నియోజకవర్గంలోని సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడులలో పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది.
 
2 పర్చూరులో సమన్వయకర్త రావి రామనాధంబాబు ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. ఉదయాన్నే బంద్‌ నిర్వహించేందుకు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు రామనాధం బాబును అరెస్టు చేసి పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. పార్టీ నేత గొట్టిపాటి భరత్‌ బొమ్మల సెంటర్‌లో టైర్లు తగులబెట్టి ఆందోళన నిర్వహించారు. వైఎస్‌ విగ్రహం వద్ద గంటపాటు నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయనను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

2 కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. సింగరాయకొండలో పార్టీ నేతలు, కార్యకర్తలు దుకాణాలను మూయించారు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జరుగుమల్లి మండలం చిరకూరపాడు, కొండపి మండలం పెట్లూరు, మర్రిపూడి మండలం జివ్వుగుంట తదితర గ్రామాల్లో పార్టీ శ్రేణులు విద్యా సంస్థలు, బ్యాంకులు మూయించి బంద్‌ నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top