
రాయల తెలంగాణ ప్రతిపాదన దౌర్భాగ్యం
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను విడగొట్టి తెలంగాణలో కలిపి ‘రాయల-తెలంగాణ’ చేయాలని కాంగ్రెస్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, టీజీ వెంకటేష్‌లతో పాటు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేస్తున్న ప్రతిపాదనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నేతలు శోభానాగిరెడ్డి, కేతిరెడ్డి
రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు మీకెవరిచ్చారు?
ఎంఐఎం తిరిగి సమైక్యం వైపు రావాలని కోరుతున్నాం
యూపీఏ సర్కారు సమైక్య ఉద్యమాన్ని ఎగతాళి చేస్తోంది
సీఎం కిరణ్ సోనియా ఆలోచనలను అమలు చేస్తున్నారు
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను విడగొట్టి తెలంగాణలో కలిపి ‘రాయల-తెలంగాణ’ చేయాలని కాంగ్రెస్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, టీజీ వెంకటేష్‌లతో పాటు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేస్తున్న ప్రతిపాదనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ‘రాయల-తెలంగాణ’ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. రాయలసీమ పౌరుషం అని చెప్పుకునే నాయకులు ఈరోజు ఓట్లు, సీట్ల కోసం దౌర్భాగ్యకరంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజల అభిప్రాయం, ఆలోచనలు తెలుసుకోకుండా రాయలసీమ అస్థిత్వం కోల్పోయే విధంగా జీవోఎంకు ప్రతిపాదనలు పంపే హక్కు వీళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘ఎంఐఎం రాయల-తెలంగాణ అనడం బాధాకరం. వారు తిరిగి సమైక్యం వైపు రావాలని కోరుతున్నాం’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
జేసీ, టీజీ వారి వ్యాపారాల కోసం, ట్రాన్స్‌పోర్ట్‌లను నడిపించుకోవడం కోసం రాయలసీమను విడగొట్టాలంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు జిల్లాలనే ఎందుకు? మొత్తం 13 జిల్లాలను కలుపుకొని తెలంగాణ అని పేరు పెట్టుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఎందుకు ఉంచలేరు? అని కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. ‘‘కేవలం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక కాంగ్రెస్, టీడీపీ అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయి. అందుకే కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతూ బాబు విభజన లేఖ ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకోవడంలేదు. కాంగ్రెస్‌కు చెందిన కర్నూలు, అనంతపురం నేతలు తాము గెలవలేమని, జగన్‌ను ఢీ కొనలేమని వారి ఉనికి కోసం రాయలసీమను చీల్చమనడం దౌర్భాగ్యకరం. ఏదో వ్యాపారం మాదిరి ఈ ఫ్లాట్ మీకు, ఆ ఫ్లాట్ మాకు అంటూ రెండుగా చీల్చాలనటం సిగ్గుచేటు’’ అని ధ్వజమెత్తారు.
ఒక సమస్యకు పరిష్కారం చేయమని కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇస్తే దాన్ని పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, జిల్లాల వారీగా ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి రాష్ట్రంలో అశాంతి, అభద్రతా భావాన్ని కల్పిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ సొంతప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజల ఆలోచన మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దోహదపడాలని హితవు పలికారు. విభజనను అడ్డుకునేందుకు తమ పార్టీ అధినేత జగన్ త్వరలోనే జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టనున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఒకవైపు న్యాయస్థానాల్లో పోరాడుతూనే, మరోవైపు రాజకీయ మద్దతు కూడగడుతున్నట్లు వివరించారు.
రహదారుల దిగ్బంధం విజయవంతం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్ జగన్ పిలుపు మేరకు రహదారుల దిగ్బంధాన్ని పార్టీశ్రేణులు, సమైక్యవాదులు కలిసికట్టుగా విజయవంతం చేశారని శోభానాగిరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం వంద రోజులుగా స్వాతంత్రోద్యమాన్ని తలపించే విధంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా వ్యవహరించడంలేదని దుయ్యబట్టారు. ప్రజా ఉద్యమాలను గౌరవించకపోగా మరింత అవమానపరిచే విధంగా యూపీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సమైక్య ఉద్యమాన్ని ఎగతాళి చేసే విధంగా వందవ రోజునే జీవోఎం సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శోభ చెప్పారు. సీఎం కిరణ్ సమైక్య ముసుగులో ఎవరికీ అనుమానం రాకుండా సోనియా ఆలోచనలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.