అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని.. రైతులను, రైతుకూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా వుందని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు.
గోరంట్ల (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని.. రైతులను, రైతుకూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా వుందని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పార్టీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ ఆర్.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఈమేరకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక డిప్యూటీ తహశీల్దార్ భరత్‌కుమార్ కు అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..రైతులను ఆదుకునేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, రైతు, రైతుకూలీల వలసలను నివారించాలని, కరవు, ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు తక్షణమే పరిహారం అందించాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను అధికార తెలుగుదేశం పార్టీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అదే విధంగా స్వామి నాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా పంట ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రానప్పుడు రైతుకు బాసటగా నిలిచేందుకు రూ.5000ల కోట్లతో మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే పంట బీమాను విడుదల చేయాలని, పెండింగ్‌లో వున్న బీమా సోమ్మును రైతు ఖాతాలలో జమచేయాలన్నారు. వ్యవసాయ రంగానికి పగటి పూట 9గంటల నిరంతర విద్యుత్‌ను అందించాలని కోరారు. అదే విధంగా జిల్లాలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్యలకు పరిష్కారమార్గంగా నిర్ణీత వ్యవధిని గుర్తించి.. ఆలోపు త్వరితగతిన జలయజ్ఞం ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలన్నారు. అలాగే టీడీపీ హామీల మేరకు వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీకి వాయిదాల పద్ధతిని తొలగించి ఆ రుణాలన్నీ తక్షణం పూర్తిగా మాఫీ చేసేందుకు చర్యలు తీసుకొవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునేందుకు, అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు.