జేసీ బ్రదర్స్‌కు తొత్తులుగా పోలీసులు

YSRCP MLA Visweswara Reddy Fire On JC Brothers - Sakshi

అనంతపురం / గుత్తి: జేసీ బ్రదర్స్‌ (దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి)కి పోలీసులు తొత్తులుగా మారిపోయారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య,  హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీమ్‌ ధ్వజమెత్తారు. వారందరూ గుత్తి స్పెషల్‌ సబ్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని శనివారం విడివిడిగా పరామర్శించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. జేసీ బ్రదర్స్‌ ఆడగాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయన్నారు. అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కదిరి, రాప్తాడు, ధర్మావరం, హిందూపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీని దెబ్బకొట్టడానికి టీడీపీ సర్కార్‌ పోలీసుల చేత అక్రమ కేసులు బనాయింపజేస్తోందన్నారు. 

పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మలుగా, మరీ ముఖ్యంగా జేసీ బ్రదర్స్‌ చెప్పు చేతల్లో ఉన్నారని ఘాటుగా విమర్శించారు. పోలీసులు ఇలా అక్రమ కేసులు బనాయించుకుంటూ పోతే లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతింటుందన్నారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు రేగుతుందన్నారు. పోలీసు యంత్రాంగం అరాచకాలను, రౌడీ, గూండాయిజాన్ని అణచి వేయడానికి పని చేయాలి తప్ప ఇలా అధికారపార్టీకి తొత్తులుగా మారితే ఇక చట్టం ఎందుకని ప్రశ్నించారు. విచారణ లేకుండా కేసులు పెడుతూ పోతే ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు. 

ఇప్పటికైనా పోలీసులు చట్టం, న్యాయం ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. పెద్దారెడ్డిని పరామర్శించిన వారిలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పైలా నరసింహయ్య, రాష్ట్ర బీసీ సెల్‌ నాయకులు మీసాల రంగన్న, పేరం నాగిరెడ్డి, మంగళ కృష్ణ, బొంబాయి రమేష్, రమేష్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఫయాజ్‌ బాషా, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, ఉరవకొండ వీరన్న, సీవీ రంగారెడ్డి, సుభాష్‌రెడ్డి, శాంతి రెడ్డి, పీరా తదితరులు ఉన్నారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top