అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

YSRCP MLA MAlagundla Shankaranarayana YSR Vahana Mitra Meeting In Anantapur  - Sakshi

బండి మొరాయిస్తున్నా.. బాగు చేయించుకోలేని స్థితిలో ఒకరు. ఇన్సూరెన్స్‌ ప్రీమియం గడువు ముగిసినా.. రెన్యూవల్‌ చేయించుకోలేని దుస్థితిలో ఇంకొకరు. ఇంట్లో డబ్బునంతా బండి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌(ఎఫ్‌సీ) కోసం ఖర్చు చేసి దసరా ముందు దిగాలుగా మరొకరు. అలాంటి వారందరి మోముల్లో నవ్వులు వికసించాయి. కష్టజీవుల హర్షధ్వానాలు.. ఆనందబాష్పాలకు అనంతపురంలోని అంబేడ్కర్‌ భవన్‌ వేదికైంది. శుక్రవారం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ లబ్ధిదారులకు మంత్రి శంకరనారాయణ అర్హత పత్రాలు అందజేయగా వారంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇంతవరకు ఏ ఒక్కరూ తమ గురించి పట్టించుకోలేదని.. తమ కష్టం తెలిసిన జగనన్న ఏటా రూ.10 వేలు ఇస్తానని మాట ఇవ్వడమే కాకుండా.. అధికారంలోకి వచ్చిన నెలల కాలంలోనే చేసి చూపారని ఈల వేసి చెప్పడం విశేషం.  

సాక్షి, అనంతపురం : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని అంబేడ్కర్‌భవన్‌లో ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద ఆటో, మ్యాక్సి డ్రైవర్లకు అర్హత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనరంజకమైన పథకాల అమలు వైఎస్‌ కుటుంబంతోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాలు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా  లక్షలాది మంది పేద ప్రజలకు పునర్జన్మ ప్రసాధించిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు నేడు ఇంజినీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని కొనియాడారు. వైఎస్సార్‌ తరహాలోనే ఆయన తనయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ కట్టుబడి ఆటోడ్రైవర్లకు అందిస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అత్యవసర సమయాల్లో నిరుపేదలను ఆదుకుంటున్నారని కొనియాడారు. ఆటోడ్రైవర్ల కష్టాలు తీర్చేందకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నార్నారు. కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ మొత్తంతో ఇన్సూరెన్స్, వాహన రిపేర్లు చేయించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. కర్టాటక నుంచి ఆటో, మ్యాక్సి క్యాబ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన వారికి కూడా లబ్ధి కలిగిస్తున్నామన్నారు. త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లోకే రూ.10 వేలు జమ అవుతుందని వివరించారు. వాహన మిత్ర పథకానికి జిల్లాలో 7,687 మంది దరఖాస్తు చేసుకోగా 7,486 మంది అర్హత సాధించారని ఉప రవాణా కమిషనర్‌ శివరాంప్రసాద్‌ తెలిపారు. 

మాటకు కట్టుబడిన సీఎం వైఎస్‌ జగన్‌   
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆటోడ్రైవర్ల కష్టాలను తెలుసుకుని వారిని ఆదుకుంటానని మాటిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేలు సాయం ప్రకటించడం గొప్ప విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 
– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే

వైఎస్‌ కుటుంబం మాట తప్పదు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన తప్పే వ్యక్తి కాదు. ప్రస్తుతం ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదే పాటిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటనీ అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే నెరవేరుస్తున్నాడు. 
– తిప్పేస్వామి,  మడకశిర ఎమ్మెల్యే  

సంఘ మిత్రుడు ఆటోడ్రైవర్‌ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఆటోడ్రైవర్‌ అంటే సంఘమిత్రుడు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రూ.10 వేల సాయం ఆటో కార్మికులకు  ఉపయోగకరం.                
– గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ  

ప్రజాసంక్షేమ ప్రభుత్వమిది 
గత ఐదేళ్లు రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని చూశాం. ఇప్పుడు ప్రజా సంక్షేమ ప్రభుత్వం వచ్చింది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల వ్యవధిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. అందరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేస్తాం. 
– అనంత వెంకట్రామిరెడ్డి,  అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే 

మా సమస్యను గుర్తించిన నేత జగన్‌  
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆటో డ్రైవర్లకు ఆనాడు మాట ఇచ్చాడు. ఈనాడు ముఖ్యమంత్రి అయ్యాక నెరవేర్చి మాట నిలుపుకున్న నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఊపిరి ఉన్నంత వరకూ ఆటో డ్రైవర్లు వైఎస్‌ జగన్‌ను మరువరు.  
– ఈశ్వరయ్య, ఆటో డ్రైవర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top