
సాక్షి, విశాఖపట్నం : రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బీజేపీలోకి ఫిరాయించినా కూడా టీడీపీకి భజనా చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్.. సుజనా చౌదరి ఎంపీగా ఉంటూ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. రాజధానిపై ఆయనకు కనీస అవగహన కూడా లేదని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాలంలో జరిగిన అవినీతిని సుజనా మర్చిపోయారా అని ప్రశ్నించారు.
రాజధాని పేరుతో అమరావతిని చంద్రబాబు ప్రైవేటు కంపెనీగా మార్చారని ధ్వజమెత్తారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు. రాజధానిపై ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్పందించకుంటే చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.