కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన నేతలకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ సూటి ప్రశ్న
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన నేతలకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అవకాశం కల్పించడాన్ని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో బీసీ ఎజెం డాను ఎత్తుకునే చంద్రబాబు తీరా పదవుల కేటాయింపు సమయంలో మాత్రం వారిని విస్మరించడం దారుణమన్నారు. ఆదివారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం టీడీపీ నుంచి కేబినెట్‌లో ఉన్న అశోక్‌గజపతిరాజు, సుజానాచౌదరి ఇద్దరూ సంపన్న, అగ్ర వర్ణాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. పార్టీ జెండాను మోసిన బీసీ నేతలను విస్మరించి, ఏనాడూ పార్టీ కార్యక్రమాలను పట్టించుకోని నేతలకు బాబు పదవులు కట్టబెడుతూ బీసీలను అవమాన పరుస్తున్నారని విమర్శించారు. బాబు బీసీలను ఎన్నికల అజెండా కోసం మాత్రమే వాడుకున్నారని మంత్రి పదవుల విషయంతో తేటతెల్లం అయిందన్నారు. ఆయన కపట వైఖరిని ఇప్పటికైనా బీసీలు గమనించాలన్నారు.