breaking news
DHARMANA krsnadas
-
పదవులప్పుడు బీసీలు గుర్తుకురారా?
చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ సూటి ప్రశ్న హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన నేతలకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అవకాశం కల్పించడాన్ని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో బీసీ ఎజెం డాను ఎత్తుకునే చంద్రబాబు తీరా పదవుల కేటాయింపు సమయంలో మాత్రం వారిని విస్మరించడం దారుణమన్నారు. ఆదివారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ నుంచి కేబినెట్లో ఉన్న అశోక్‌గజపతిరాజు, సుజానాచౌదరి ఇద్దరూ సంపన్న, అగ్ర వర్ణాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. పార్టీ జెండాను మోసిన బీసీ నేతలను విస్మరించి, ఏనాడూ పార్టీ కార్యక్రమాలను పట్టించుకోని నేతలకు బాబు పదవులు కట్టబెడుతూ బీసీలను అవమాన పరుస్తున్నారని విమర్శించారు. బాబు బీసీలను ఎన్నికల అజెండా కోసం మాత్రమే వాడుకున్నారని మంత్రి పదవుల విషయంతో తేటతెల్లం అయిందన్నారు. ఆయన కపట వైఖరిని ఇప్పటికైనా బీసీలు గమనించాలన్నారు. -
సమైక్య శంఖం పూరించండి
నరసన్నపేట, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ఆరుకోట్ల ప్రజల మనోభావాలను, ఆకాంక్షను అవహేళన చేస్తూ కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నరసన్నపేటలోని కార్యాలయంలో సభకు తరలివెళ్లే విషయమై ముఖ్య కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. అనంతర విలేకరులతో మాట్లాడుతూ శంఖారావం సభకు జిల్లా నుంచి వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివెళ్లనున్నారని చెప్పారు. ఈ సభకు కార్యకర్తలు వెళ్లేందుకు వీలుగా ఈ నెల 25న ఉదయం పలాస నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామని, అయితే అనివార్య కారణాల వల్ల రైలు సౌకర్యం కల్పించడం కుదరలేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తమ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తీసుకెళ్లేందుకు బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు సమకూర్చుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులతోపాటు ఇతర అన్ని వర్గాల ప్రజలు సభకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభ ఏ ఒక్కరికో.. ఏదో ఒక పార్టీకో సంబంధించినది కాదని, కోట్లాది ప్రజల, వారి వారసుల భవిష్యత్తును అంధకారం చేసే రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నందున పార్టీలకు అతీతంగా అందరూ సభకు హాజరై సమైక్య ఆకాంక్షను ఎలుగెత్తి చాటాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగ రావు, పార్టీ నాయకులు డి.జయప్రకాష్, మొజ్జాడ శ్యామలరావు, కణుసు సీతారాం, బోర నర్సునాయుడు, పంగ శ్రీరాములు, సడగాన రవి, సతివాడ రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.