సమైక్య శంఖం పూరించండి


 నరసన్నపేట, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ఆరుకోట్ల ప్రజల మనోభావాలను, ఆకాంక్షను అవహేళన చేస్తూ కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నరసన్నపేటలోని కార్యాలయంలో సభకు తరలివెళ్లే విషయమై ముఖ్య కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. అనంతర విలేకరులతో మాట్లాడుతూ శంఖారావం సభకు జిల్లా నుంచి వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివెళ్లనున్నారని చెప్పారు. ఈ సభకు కార్యకర్తలు వెళ్లేందుకు వీలుగా ఈ నెల 25న ఉదయం పలాస నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామని, అయితే అనివార్య కారణాల వల్ల రైలు సౌకర్యం కల్పించడం కుదరలేదన్నారు.

 

 పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తమ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తీసుకెళ్లేందుకు బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు సమకూర్చుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులతోపాటు ఇతర అన్ని వర్గాల ప్రజలు సభకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభ ఏ ఒక్కరికో.. ఏదో ఒక పార్టీకో సంబంధించినది కాదని, కోట్లాది ప్రజల, వారి వారసుల భవిష్యత్తును అంధకారం చేసే రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నందున పార్టీలకు అతీతంగా అందరూ సభకు హాజరై సమైక్య ఆకాంక్షను ఎలుగెత్తి చాటాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగ రావు, పార్టీ నాయకులు డి.జయప్రకాష్, మొజ్జాడ శ్యామలరావు, కణుసు సీతారాం, బోర నర్సునాయుడు, పంగ శ్రీరాములు, సడగాన రవి, సతివాడ రామినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top