రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇప్పటికే సమైక్యోద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ.. రానున్న నెల రోజుల్లోనూ తీవ్రత పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది.
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇప్పటికే సమైక్యోద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ.. రానున్న నెల రోజుల్లోనూ తీవ్రత పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జాతీయోద్యమాన్ని శాంతియుత వాతావరణంలో నడిపించిన గాంధీజీ స్ఫూర్తితో నేటి నుంచి పార్టీ శ్రేణులు ఆందోళనబాట పట్టనున్నాయి. బుధవారం నుంచి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. తద్వారా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రజలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయించారు. సమైక్యాంధ్రకు ఆది నుంచి కట్టుబడిన పార్టీగా దీక్షలతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నిర్ణయిస్తూ తాను కూడా ఆళ్లగడ్డలో దీక్ష చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు.
నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త భూమ నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపట్టనున్నారు. కర్నూలులో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి సతీమణి విజయమ్మ స్థానిక శ్రీకృష్ణదేవరాయల కూడలిలో చేపట్టనున్న దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత ఆధ్వర్యంలో కర్నూలు-నంద్యాల రోడ్డులోని గౌరు శంకర్ ఆస్పత్రి వద్ద దీక్ష కొనసాగనుంది. ఆదోనిలో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాద్‌రెడ్డి స్థానిక వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద 50 మందితో రిలే నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి సోమప్ప సర్కిల్‌లో నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కూడలిలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిరవధిక దీక్షకు సిద్ధం కాగా.. ఆయన సోదరుడు సీతారామిరెడ్డి కూమారుడు ప్రదీప్‌రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
నందికొట్కూరులోని పటేల్ సెంటర్‌లో పార్టీ ప్రచార కార్యదర్శి ఐజయ్య.. కోడుమూరులోని పాతబస్టాండ్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ నిరవధిక దీక్షలో కూర్చొంటున్నారు. ఆలూరులో నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం అంబేద్కర్ సర్కిల్‌లో.. శ్రీశైలం డ్యాం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖరరెడ్డి.. పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి వెల్దుర్తిలో దీక్ష చేపట్టనున్నారు. బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి, డోన్‌లో నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు నిరవధిక దీక్షకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యాచరణ
అక్టోబర్ 2 నుంచి నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల రిలే నిరవధిక దీక్షలు.
7న మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల ఎదుట రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ధర్నాలు.
10న మండల కేంద్రాల్లో రైతులతో దీక్షలు.
17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు.
21న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో కార్యక్రమాలు, మానవహారాలు.
24న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు.
26న జిల్లాలోని సర్పంచ్‌లు, సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులతో కర్నూలులో ఒక రోజు దీక్ష.
29న నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతి ర్యాలీలు.
నవంబర్ 1న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు, సమైక్యాంధ్ర కోసం తీర్మానం.