రేమల్లేలో వైఎస్‌ విగ్రహం ధ్వంసానికి యత్నం

YSR Statue Broken In Krishna - Sakshi

గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన

బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌ సీపీ శ్రేణుల డిమాండ్‌

కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం) : బాపులపాడు మండలం రేమల్లేలోని గ్రామ కూడలిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. ఈ ఘటన మంగళవారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మహానేత వైఎస్‌ విగ్రహం ధ్వంసం చేయటానికి యత్నించినట్లుగా పలుచోట్ల ఉన్న దెబ్బలను గ్రామస్తులు గుర్తించారు. వైఎస్‌ విగ్రహంలో తలను ధ్వంసం చేసేందుకు యత్నించటంతో మెడ వద్ద బీటలు వారడంతో పాటుగా పలుచోట్ల గట్టి దెబ్బలు కనిపించాయి. విగ్రహం తల వెనుక భాగంలో పాగా స్వల్పంగా ధ్వంసమైంది. దీంతో గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

విగ్రహ ధ్వంసంపై వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చెలరేగకుండా అదుపు చేశారు. గ్రామ కూడలిలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉండటంతో వాటి ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని పార్టీ నాయకులు కోరారు. దీంతో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. కాగా సాయంత్రం పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు గ్రామంలో పర్యటించి ధ్వంసమైన వైఎస్‌ విగ్రహాన్ని పరిశీలించారు. మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ వైరంతో విగ్రహాలపై ప్రతాపం చూపటం తగదన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దుట్టా శివ నారాయణ, జిల్లా కార్యదర్శి నక్కా గాంధి, జిల్లా అధికార ప్రతినిధి వేగిరెడ్డి సూర్యనారాయణ, మండల మాజీ అధ్యక్షుడు యనమదల సాంబశివరావు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు తోమ్మండ్రు రమేష్, పార్టీ నాయకులు సూరపనేని రాధాకృష్ణమూర్తి, చౌటపల్లి జేమి, అల్లంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top