21న వైఎస్సార్‌ నేతన్న నేస్తం | YSR Nethanna Nestham Starts on 21December PSR Nellore | Sakshi
Sakshi News home page

21న వైఎస్సార్‌ నేతన్న నేస్తం

Dec 7 2019 11:29 AM | Updated on Dec 7 2019 11:29 AM

YSR Nethanna Nestham Starts on 21December PSR Nellore - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు

నెల్లూరు(పొగతోట) : జిల్లాలో అర్హులైన చేనేతలకు వైఎస్సార్‌ నేతన్న నేస్తం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ నేతన్ననేస్తంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. కష్టాలు ఎదుర్కొంటున్న చేనేతలకు చేయూత నందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. పథకం ద్వారా అర్హులైన చేనేతలందరికి ఈనెల 21న రూ.24 వేలు ఆర్థిక సాయం అందించాల్సి ఉందన్నారు. దీనిపై చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 5,943 మంది సొంత మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలను గుర్తించామని, వాటిలో 14 డబుల్‌ ఎంట్రీలు నమోదు కావడంతో వాటిని తొలగించామని తెలిపారు. అభ్యర్థుల జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరామని పేర్కొన్నారు. 967 కుటుంబాల పేర్లు జాబితాలో లేవని, వారి నుంచి దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిని పరిగణలోకి తీసుకుని 6,852 మంది అర్హుల జాబితాను సిద్ధం చేశామని తెలియజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లలో నగదు జమ ఆయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చేనేత జౌళిశాఖ ఏడీఓ ప్రసాదరావు, చేనేత సేవ కేంద్రం సహాయ సంచాలకులు జనార్దన్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

నిధులను సద్వినియోగం చేయండి
ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించిందన్నారు. వార్షిక బడ్జెట్‌ కేటాయించడంలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన నిధులను నెలాఖరుకు 70 శాతం వరకు ఖర్చు చేయాలని స్పష్టంచేశారు. 2020 మార్చి నాటికి నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ–2 కమలకుమారి, డీఆర్‌డీఏ పీడీ శీనానాయక్, డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రైతుల బకాయిలు చెల్లించండి
షుగర్‌కేన్‌ రైతులకు సత్వరమే బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెల్లించవలసిన బకాయిలపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. చెరకు సరఫరా చేసిన 900 మంది రైతులకు రూ.8.67 కోట్లు చెల్లించవలసి ఉందన్నారు. ఫ్యాక్టరీని మూసివేసి ఐదు నెలలు గడిచినప్పటికి రైతులకు బకాయిలు చెల్లించలేదన్నారు. ఫ్యాక్టరీ స్థిర, చరాస్తుల వ్యాల్యువేషన్‌ రిపోర్టును షుగర్‌కేన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రకారం ఆర్‌ఆర్‌ యాక్టు కింద చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బకాయిలు వసూలు చేసేందుకు పొదలకూరు తహసీల్దార్‌ ఆర్‌ఆర్‌ యాక్టు ప్రకారం వేలం వేసేందుకు నోటీలులు ఇచ్చారని తెలిపారు. దీనిపై ఇండియన్‌ బ్యాంక్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులు బ్యాంకుకు మార్ట్‌గేజ్‌ చేసి ఉన్నారని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారని, కోర్టు వారు నాలుగు వారాలు స్టేటస్‌కో ఇచ్చినట్లు వివరించారు. దీనిపై కౌంటర్‌ ఆఫిడవిట్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో రైతుల బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ మల్లికార్జున, నెల్లూరు ఆర్డీఓ హూస్సేన్‌ సాహెబ్, షుగర్‌కేన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జాన్‌విక్టర్, పొదలకూరు తహసీల్దార్‌ స్వాతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement