వైఎస్సార్‌ కాపు నేస్తం

YSR Kapu Nestham to Financial assistance for Kapu and Balija and Telaga Womens - Sakshi

కాపు, బలిజ, ఒంటరి, తెలగ మహిళలకు ఆర్థిక సాయం

ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లు సాయం

గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేల ఆదాయమున్న వారికి వర్తింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఆర్థికసాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకానికి శ్రీకారం చుడుతోంది. 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధికోసం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఈ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పథకం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చింది. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ పథకం ద్వారా దాదాపు ఆరు లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచనా.

అభ్యర్థుల ఎంపికలో నిబంధనలివీ: మహిళల వయోపరిమితి 45 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలలోపు, అర్బన్‌లో రూ.12 వేలలోపు ఉండాలి. కారు ఉండకూడదు. ట్యాక్సీ, మినీవ్యాన్‌ వంటి వాటి ద్వారా జీవనం సాగిస్తుంటే మినహాయింపు ఇచ్చారు. మూడెకరాల మాగాణీ లేదా పదెకరాల మెట్ట భూమి, లేదా మాగాణి, మెట్ట కలిపి పదెకరాల భూమి ఉండవచ్చు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్‌ కూడా తీసుకుంటూ ఉండకూడదు. కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్‌ తీసుకుంటున్నవారు ఉన్నా.. కాపు నేస్తం వర్తిస్తుంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు. 2020 మార్చి నుంచి 2024 మార్చి వరకు ఐదేళ్లపాటు సాయం అందజేస్తారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. వలంటీర్లు అభ్యర్థుల సమాచారాన్ని సేకరిస్తారు. గ్రామ సచివాలయం వద్ద లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే మార్చిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమవుతుంది.
– హరేందిరప్రసాద్, కాపు కార్పొరేషన్‌ ఎండీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top