సేవా ఆణిముత్యం

YSR Kadapa Chief Justice Gokavarapu Srinivas Special Story - Sakshi

మానవతకు చిరునామాగా నిలిచిన గోకవరపు శ్రీనివాస్‌

జిల్లా న్యాయశాఖకే కాక ప్రజల్లోనూ తనదైన సేవా ముద్ర  

నూతన పీడీజేగా సి. పురుషోత్తం కుమార్‌  

కడప అర్బన్‌:  జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి బదిలీ అయిన గోకవరపు శ్రీనివాస్‌ విధుల్లో చేరినప్పటి నుంచి ‘మానవత’కు చిరునామాగా ఖ్యాతిగడించారు. 2017 మార్చిలో విధుల్లో చేరిన ఆయన న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలను నిర్వహించి ‘సేవా ఆణిముత్యం’ అనిపించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే కోర్టు ఆవరణలో కార్పొరేషన్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పోలీసుశాఖల సమన్వయంతో బురదగా ఉన్న నేలను మట్టితో చదును చేయించడం, బెంచీలను విస్తృతంగా ఏర్పాటు చేయించారు. నూతన జిల్లా కోర్టు భవనాల సముదాయ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు అయ్యేందుకు తమవంతుగా కృషి చేశారు. జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ. 10వేల లోపువారి దరఖాస్తు దారులను పరిశీలించి వారిలో 18,165 మందిని లబ్ధిదారులుగా గుర్తించి, రూ. 13,18,6,785 మంజూరయ్యేందుకు తమ న్యాయమూర్తులు సిబ్బందితో కలిసి అహర్నిశలు శ్రమించారు.

2018–19 సంవత్సరంలో ప్రజలకు కేసుల పరిష్కారం, సేవా కార్యక్రమాలకుగాను నేషనల్‌ లీగల్‌ లిటరసీ సెల్‌( ఎన్‌ఎల్‌ఎస్‌ఏ) వారు గుర్తించి రెండు ఉత్తమ అవార్డులను అందజేశారు. గత ఏడాది నవంబర్‌ 9న వీటిని నూఢిల్లీలో అందజేశారు. జిల్లా వ్యాప్తంగా డీఎల్‌ఎస్‌ఏ, పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు తమ వంతు కృషి చేశారు. బాధితులెవరైనా సరే న్యాయం కోసం వస్తే వారికి సకాలంలో, సత్వరంగా కేసుల పరిష్కారం చేయడంతో పాటు సమయం, డబ్బులు వృథా కాకుండా చేయగలిగారు. జిల్లా వ్యాప్తంగా బాధితులు ఒకదశలో పోలీస్‌స్టేషన్‌ల మెట్లెక్కడంకంటే.. జిల్లా కోర్టు మెట్లెక్కడం ఎంతో ప్రయోజనం చేకూర్చిందనే స్థాయికి తీసుకుని వచ్చారు. ట్రాన్స్‌జెండర్స్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు, కాంటాక్ట్‌ ఉద్యోగులకు తమ వంతుగా సేవచేశారు. మొత్తంమీద ఒకవైపు న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈయన సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నారు. కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్థానం నుంచి విశాఖపట్నంలోని పరిశ్రమల ట్రిబ్యునల్‌ కం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ లేబర్‌కోర్టు చైర్మన్‌గా గోకవరపు శ్రీనివాస్‌ బదిలీ ఆయ్యారు. 

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పురుషోత్తంకుమార్‌:  జిల్లాకు ప్రధానన్యాయమూర్తిగా ఏపీ హైకోర్టులో రిజిష్ట్రార్‌గా పనిచేస్తున్న సీ. పురుషోత్తం కుమార్‌ నియమితులయ్యారు. ఆయన త్వరలో విధుల్లో చేరనున్నారు.   జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తిగా విధులను నిర్వహిస్తున్న బి. సత్యవెంకట హిమబిందును విశాఖపట్నం సీబీఐ కేసులకు సంబంధించి ప్రిన్సిపల్‌ జడ్జిగా బదిలీ అయ్యారు. అలాగే  జిల్లాలోని రాజంపేట కోర్టులో మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న సీ. సత్యవేణి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని మహిళల నేరాల, లైంగిక నేరాలను పరిష్కరించే స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.  రాజంపేటలోని మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా విశాఖపట్నం ఏడవ జిల్లా అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్న ఆర్‌వివిఎస్‌ మురళీకృష్ణ బదిలీ అయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top