
సైదులును కఠినంగా శిక్షించాలి
బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని అరుణపై కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆ యువతి మరణానికి కారకుడైన సైదులును కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని అరుణపై కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆ యువతి మరణానికి కారకుడైన సైదులును కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ వంటి కఠిన చట్టాలు వచ్చినా సమాజంలో మార్పురావడం లేదని, రోజు రోజుకూ ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించినప్పుడే ప్రేమోన్మాదుల ఘాతుకానికి బలైపోయిన ఎందరో యువతుల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అరుణ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.