వైఎస్‌ జయంతి.. ఇక రైతు దినోత్సవం

YS Rajasekhar Reddy Jayanthi as Farmers Day - Sakshi

సంక్షేమ పథకాల ఫలాలు అన్నదాతలందరికీ అందాలి

డీలర్ల నియామకం అవసరం లేదు

కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం

సాక్షి, అమరావతి: అన్నదాతల ఆపద్బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రతి ఏటా వైఎస్‌ జయంతి అయిన జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేని రుణం తదితరాలకు సంబంధించిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు పండుగలా నిర్వహించాలని సూచించారు.   

ఇక చౌక ధరల దుకాణాలు ఉండవు
‘గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చౌక ధరల దుకాణాలు ఉంటాయా? ఉండవా? చాలా చోట్ల డీలర్లు లేరు. ఖాళీలు భర్తీ చేయాలా? అవసరం లేదా? మార్గనిర్ధేశం చేయండి’ అని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ కోరగా ‘డీలర్ల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం లేదు. గ్రామ వలంటీర్లే ఇంటింటికీ నిత్యావసర సరకులు సరఫరా చేస్తారు’ అని సీఎం స్పష్టం చేశారు. 

ఒకే రోజు రైతులందరికీ పెట్టుబడి రాయితీ
వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడిని అక్టోబర్‌ 15వ తేదీన రాష్ట్రమంతా ఒకేరోజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ప్రతి రైతు కుటుంబానికి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారు. కౌలు రైతులకు ప్రభుత్వ రాయితీలు, పెట్టుబడి రాయితీ, పంటల బీమా తదితర సంక్షేమ పథకాల ఫలాలు పక్కాగా అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని నొక్కి చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top