ఆత్మీయులతో జగన్‌ మమేకం

YS Jaganmohan Reddy participated in the Iftar feast  - Sakshi

పులివెందులలో రోజంతా బిజీబిజీగా గడిపిన ప్రతిపక్షనేత

మైనార్టీ సోదరుల ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి కడప: పులివెందులలో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం బిజీబిజీగా గడిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, యోగ క్షేమాలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. వారి దగ్గర నుంచి వినతులు స్వీకరించిన ఆయన రాబోయేవన్ని మంచి రోజులేనని అందరికి మేలు చేస్తానని భరోసా ఇచ్చారు. పోరాటం చేశాం. కొద్దికాలం ఓపిక పట్టండి..దేవుని దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రానుంది. అందరికీ మంచి జరుగుతుందని జగన్‌మోహన్‌రెడ్డి వారితో అన్నారు.    

కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం..  
పులివెందులలోని భాకరాపురంలో ఉన్న ప్రతిపక్షనేత క్యాంపు కార్యాలయం ప్రజలతో కిక్కిరిసింది. ఆయనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యాలయ ఆవరణం అంతా ఎక్కడ చూసినా పార్టీ శ్రేణులతో నిండిపోయింది. భారీగా వచ్చిన శ్రేణులను కట్టడి చేయడం పోలీసులకు కూడా కష్టతరమైంది. వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతిపక్షనేతను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్‌.రఘురామిరెడ్డి, ఎస్‌.బి.అంజాద్‌ బాషా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనువాసులు, డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, కరణం ధర్మశ్రీ, ఏసురత్నం, డాక్టర్‌ శిద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారితో జగన్‌మోహన్‌రెడ్డి పలు విషయాలు చర్చించారు.    

నూతన జంటకు ఆశీర్వాదం.. 
పులివెందులలోని రాజ్యలక్ష్మి థియేటర్‌ ఎదురుగా ఉన్న వీధిలో నివాసముంటున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు మోడం పద్మనాభరెడ్డి ఇంటికి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లారు. ఇటీవలే వివాహమైన పద్మనాభరెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, కోడలు సుజితలను ఆశీర్వదించారు. అప్పట్లో బిజీగా ఉండి వివాహానికి రాలేకపోయిన ఆయన బుధవారం సాయంత్రం మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డిలతో కలిసి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు.   

ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌..  
పులివెందులలోని వీజే ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ   అధ్యయన కమిటీ సభ్యులు రసూల్‌ సాహెబ్‌ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌కు ఇమామ్‌ జామిన్‌ను చేతికి కట్టారు. అనంతరం  ఇస్లాం సంప్రదాయ పద్ధతి ప్రకారం టోపీ పెట్టుకుని దువా చేశారు. ఆ తరువాత విందారగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్‌ బాషా, పార్టీ నాయకులు వైఎస్‌ మనోహర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నప్ప, పట్టణ కన్వీనర్‌ వరప్రసాద్, మైనార్టీ నాయకుడు ఇస్మాయిల్, రఫీ, హఫీజ్, బాబు, బాషాలతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top