మైనార్టీ జీవితాల్లో.. మేజర్‌ వెలుగులు

YS Jaganmohan Reddy Introduced Many Schemes For Muslim Community  - Sakshi

జగన్‌ హామీతో నిరుపేద ముస్లింలకు మేలు

జిల్లాలో 20వేల మందికి భరోసా

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): చదువులు లేక..ఉద్యోగాలు రాక..ఆర్థిక స్థోమత లేక..పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దలేక..చిరు వ్యాపారాలు, కూలి పనులు చేసుకుంటూ బతుకులీడుస్తున్న వారి చీకటి జీవితాల్లో దివంగత వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి దయతో వెలుగులు విరజిమ్మాయి. దివంగత వైఎస్సార్‌ ముస్లిం మైనార్టీలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో ముస్లిం సోదరులు వారి పిల్లల చదువుకు ఆర్థిక భారం లేకుండా బాగా చదివించి  బంగారు భవిష్యత్తును అందజేశారు. పిల్లలు ప్రయోజకులు కావడంతో తామంతా ఇప్పుడు ధీమాగా బతుకులీడుస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలకు వెలుగులు ప్రసాదించిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తమకు దైవంతో సమానమంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మైనార్టీలకు బంగారు భవిష్యత్‌ నిచ్చారు. రాజశేఖరుడి దయవల్ల వేలాదిమంది ముస్లిం సోదరులకు బంగారు భవిష్యత్‌ దొరికిందంటూ ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది నిరుపేద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి కులధ్రువీకరణ పత్రాలిచ్చి చదవుకునేందుకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందేందుకు సహకరించారు. తండ్రి రాజశేఖర్‌ రెడ్డి బాటలోనే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుచుకుంటున్నాడు.

దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వరకు సీట్లు ముస్లింలకు ప్రకటించి అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు అత్యధికంగా సీట్లిచ్చి రాజకీయ ప్రాధాన్యం కల్పించి ముస్లిం సోదరుల అభ్యున్నతికి పాటుపడుతున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్‌ దయ ఉంచి ఎంతో మంది ముస్లిం సోదరులకు పెన్షన్లు, రేషన్‌కార్డులు, అంత్యోదయ కార్డులు అందించి నిరుపేద మైనార్టీల బతుకుల్లో వెలుగులు నింపారు. ఉగాది పర్వదినాన జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో మైనార్టీలకు మరింత ఉత్తేజం నింపేలా హామీలిచ్చారు.

తండ్రి కంటే మిన్నగా తనయుడు
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధానంగా మసీదులకు చెందిన వక్ఫ్‌బోర్డు భూములను కాపాడేందుకు చట్టం తీసుకొస్తామన్నారు. మత గురువులకు గౌరవ వేతనం ఇస్తామన్న హామీ, హజ్‌యాత్రకు అయిన ఖర్చులు తానే అందిస్తానని చెప్పిన హామీలతో మరింత ఆనందం వచ్చిందని ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి వైఎస్సార్‌ను మించి జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీలకు మరింత భరోసానిచ్చారు. దేశ చరిత్రలోనే వైఎస్సార్‌ లాంటి నిర్ణయం ఇంకెవరూ తీసుకోలేదని..4శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో ఎంతో మంది మైనార్టీలు ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, పోలీస్‌ ఉద్యోగులుగా, టీచర్లుగా, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు పొంది కుటుంబాలతో హాయిగా గడుపుతున్నారనిచెబుతున్నారు. జిల్లాలో సుమారు 20వేల మంది ముస్లిం లు ఉన్నారు. వీరంతా రాజశేఖరరెడ్డిని దేవుడిలా కొలుస్తున్నారు.

జగన్‌తోనే రాజన్న రాజ్యం
మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే మైనార్టీలకు సుపరిపాలన అందిస్తారనే ఆశతో వారంతా ఉన్నారు. జిల్లాకు చెందిన మైనార్టీలు టీచర్లుగా 20మంది, డాక్టర్లుగా  నలుగురు, సబ్‌ఇన్స్‌స్పెక్టర్లుగా ఇద్దరు, కానిస్టేబుల్స్‌గా పదిమంది, ట్రెజరీ ఉద్యోగులుగా ఇద్దరు, ఏసీటీవోగా ఒకరు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పది మంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో మరింతమంది ఉద్యోగావకాశాలు పొందారు. గతంలో చదువుకునేందుకు అవకాశం లేక రోడ్డుపక్కన చిరు వ్యాపారాలు, కూలి పనులు చేసుకుంటూ బతికేవారంతా వైఎస్సార్‌ దయవల్ల సమాజంలో దర్జాగా బతుకుతున్నారు. దీంతో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, సోదరి రాజన్న రాజ్యం మళ్లీ వచ్చి తమ బతుకులకు దర్జా రావాలంటే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిని గెలిపించుకోవాలని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

వలసలు ఆగాయి
గతంలో ముస్లిం సంక్షేమం కోసం ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోక పోవడంతో మాలో చాలా మంది విదేశాలకు వలస కూలీలుగా వెళ్లేవారు. అక్కడ వారు పడుతున్న కష్టాలు చెప్పలేనివి. రాజశేఖర్‌రెడ్డి దయవల్ల  4 శాతం రిజర్వేషన్లతో  ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం రావడంతో అర్హత కలిగిన ముస్లింలు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అదేవిధంగా  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల మా పిల్లలకు మంచి విద్యను అందించాం. తండ్రి అడుగుజాడల్లో కుమారుడు జగన్‌ ముస్లింల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసి రుణాలు, సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పడం శుభపరిణామం. జగన్‌ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తారనే నమ్మకం ఉంది.
ఎం,డి, ఉస్మాన్, ఇచ్ఛాపురం 

ముస్లింలపాలిట దేవుడు వైఎస్సార్‌
దేశ చరిత్రలో ఏ నాయకుడూ తీసుకోని నిర్ణయం దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకుని ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌ కల్పించి చీకటి జీవితం గడుపుతున్న ముస్లింల బతుకుల్లో వెలుగులు నింపారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నతోనే సాధ్యమవుతుందని ముస్లింలంతా దృఢనమ్మకంతో ఉన్నారు. ముస్లింలకు పూర్వ వైభవం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలి. మైనార్టీల పక్షాన నిలబడేది వైఎస్సార్‌ కుటుంబమే. వైఎస్సార్‌ కుటుంబ రుణం ముస్లింలు ఏ విధంగా తీర్చుకోవాలో తెలియడం లేదు. ముస్లిలకు వైఎస్సార్‌ ఓ ప్రత్యక్ష దైవం.  
 ఎం.ఎ రఫీ, మైనార్టీసెల్, జిల్లా అధ్యక్షుడు 

వైఎస్సార్‌ దయతోనే ఇంజినీరింగ్‌ పూర్తి
దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 4శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంతో మంచి కాలేజీలో సీటు వచ్చింది. దీంతో  పైసా చెల్లించకుండానే ఇంజినీరింగ్‌ చదువు పూర్తిచేశా. ఆయన దయవల్ల మా కుటుంబం మీద ఆర్థిక భారం తగ్గింది. మళ్లీ జగనన్న అధికారంలోకి వస్తే మైనార్టీలకు న్యాయం జరుగుతుంది.  
మహ్మద్‌ సల్మాన్, ఇంజనీరింగ్‌ విద్యార్థి                               

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top