
శుక్రవారం విజయవాడలో రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నవరత్నాల అమలుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర అవతరణ వేడుకలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాల అవసరాలు తీర్చడంతోపాటు వారి తర్వాతి తరం వారు కూడా సగర్వంగా తలెత్తుకొని తిరిగేలా నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చెప్పిన మాట ప్రకారం ఐదేళ్ల తర్వాత నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మళ్లీ ఘనంగా నిర్వహిస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కడప కోటిరెడ్డి, దామోదరం సంజీవయ్య, గౌతు లచ్చన వంటి ఎందరో మహానుభావులు, కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సాహితీవేత్తలు, పాత్రికేయుల భావాలు అందరికీ ఆదర్శమని ముఖ్యమంత్రి కొనియాడారు.
‘విద్య, వైద్య, వ్యవసాయం’ రూపురేఖలు మార్పడానికే నవరత్నాలు
1956 నుంచి 2014 వరకూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తరువాత 2014లో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో వేరుగా ప్రయాణిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. 13 జిల్లాల ప్రజలు చేసిన శ్రమ అంతా చెన్నై, హైదరాబాద్‌లో మిగిలిపోయిందని పేర్కొన్నారు. 2009 సెప్టెంబర్ 2 వరకూ.. అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ రాష్ట్రం విడిపోయే పరిస్థితులు వస్తాయని ఎన్నడూ ఊహించలేదన్నారు. విభజన తర్వాత ఏ రాష్ట్రం కూడా దగా పడని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదని, వెనకడుగు వేయలేదని, వెన్ను చూపలేదని అన్నారు.
అభివృద్ధి తప్ప మన ముందు మరో మార్గం లేదన్నట్లుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. మన రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ సౌధాన్ని పునర్నిర్మిస్తున్నామని వివరించారు. వెనుకబాటుతనం, పేదరికం, నిరక్షరాస్యతను నిర్మూలిస్తేనే మనం ఒక జాతిగా పైకి ఎదుగుతామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్పడం కోసం ఉద్దేశించినవే నవరత్నాలని చెప్పారు. మహనీయుల స్ఫూర్తితో మనమంతా కలిసికట్టుగా కష్టపడితే మంచి రోజులు తప్పక వస్తాయన్నారు. దేవుడి ఆశీర్వాదం, ప్రజలందరి చల్లని దీవెనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తోంది
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుగు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, పూర్తి నిబద్ధత, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం, వికేంద్రీకృత పరిపాలనతో నూతన రాష్ట్రాన్ని అద్భుతంగా నిర్మించుకోగలరనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఆంధ్రులు ఎంతో ఘనమైన చరిత్ర గలిగిన వారని అన్నారు. అభివృద్ధి చెందాలనే తపన వారి రక్తంలోనే ఉందన్నారు. ఆయన విజయవాడలో రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో ప్రసంగించారు. ‘‘సభికులందరికీ నమస్కారం.. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి, బెజవాడ శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. గొప్ప చరిత్ర, సంస్కృతి, వారసత్వాలు కలిగిన రాష్ట్రానికి తాను గవర్నర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. చారిత్రకంగా ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉందని గుర్తుచేశారు. ఆంధ్రులు భారతీయతలో తమదైన ప్రత్యేకత పొందారని ప్రశంసించారు.