
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
సాక్షి, అమరావతి/అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికి రెండు జిల్లాలు పూర్తి చేశారు.
ఈ నెల 6న చిత్తూరు (తిరుపతి), 7న వైఎస్సార్ జిల్లాల్లో జరిగిన సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. సోమవారం అనంతపురం వేదికగా శంఖారావం పూరించడానికి సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు అనంతపురం నగరానికి చేరుకోనున్న జగన్ అక్కడ శ్రీ 7 కన్వెన్షన్ హాలుకు చేరుకుని వివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస్థులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు రోడ్డులో ఉన్న అశోక్ లేల్యాండ్ షోరూమ్‌కు ఎదురుగా ఉన్న స్థలంలో అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఒక క్రమ పద్ధతిలో జగన్ ప్రతి జిల్లాలోనూ ఏ రాజకీయ పార్టీకి చెందని తటస్థ వర్గాలతో స్థానిక సమస్యలు, సమాజంలోని ఇతర అంశాలపై సమస్యలను ఆసక్తిగా తెలుసుకుని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే మేళ్లను వారికి వివరిస్తున్నారు. నవరత్నాల్లో ప్రకటించిన అంశాలపై కూడా వారికి వివరణ ఇస్తున్నారు. సభా ఏర్పాట్లను పార్టీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.