ప్రజాగ్రహానికి జడిసే బిల్లు వెనక్కు: వైఎస్ జగన్


* విభజన బిల్లు మీద అసెంబ్లీ తీర్మానంపై వైఎస్ జగన్

* ప్రజల ‘జై సమైక్యాంధ్ర’ నినాదం అసెంబ్లీలో ప్రతిధ్వనించింది..

* విభజనను ఆపేందుకు పార్లమెంటులోనూ పోరాటం

* అమ్మ, నేను, ఎమ్మెల్యేలంతా రాష్ట్రపతిని కలుస్తాం

* అసెంబ్లీ తిప్పిపంపిన బిల్లును పార్లమెంటుకు పంపొద్దని రాష్ట్రపతిని ఒప్పించే ప్రయత్నం చేస్తాం..

* వచ్చే ఎన్నికల్లో 30 పార్లమెంటు స్థానాలు సాధించి ‘సమైక్యాంధ్ర’ను శాశ్వతం చేసుకుందాం..

 


‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును వెనక్కు పంపుతూ తీర్మానించారు. ఇది నిజంగా సంతోషించదగ్గ వార్త. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మనసు మారి విభజన బిల్లు వెనక్కు పంపుతున్నారంటే ఆ ఘనత ప్రజలదే. నెలకుపైగా చిత్తూరు జిల్లాలో పల్లె పల్లె చుడుతూ సాగిన ‘సమైక్య శంఖారావం యాత్ర’లో మీరు దిక్కులు పిక్కటిల్లేలా చేసిన ‘జై సమైక్యాంధ్ర’ నినాదం అవకాశవాద రాజకీయాలు చేయాలనుకున్న వారి గుండెల్లో సింహనాదమైంది. అసెంబ్లీలో మార్మోగింది. చివరకు విభజన బిల్లును వెనక్కు తిప్పి పంపేందుకు కారణమైంది. ఈ ఘనత చిత్తూరు జిల్లా ప్రజలదే’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో నాలుగో విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ చివరి రోజు గురువారం చంద్రగిరి నియోజకవర్గంలో సాగింది. 11వ రోజు యాత్రలో భాగంగా చంద్రగిరిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం జగన్ మాటల్లోనే..

 

 ఆరోజే సీఎం రాజీనామా చేసి ఉంటే..

 ‘‘ఈ రోజు అసెంబ్లీ రాష్ట్ర విభజన బిల్లును వెనక్కు పంపుతూ తీర్మానం చేసింది. ఇది సంతోషించదగ్గ పరిణామం. అయితే నిన్నటి దాకా సోనియా గీచిన గీత దాటకుండా కిరణ్, ప్యాకేజీల కోసం కుమ్మక్కు రాజకీయాల్లో మునిగిపోయిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా తామే సమైక్య చాంపియన్లమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తన కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకుగాను మన రాష్ట్రాన్ని విభజించేందుకు సోనియా గాంధీ పూనుకొన్న మరుక్షణమే ‘మా రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు నీకెక్కడుంది?’ అని కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా పత్రాన్ని ఆమె ముఖాన పడేసి వచ్చినట్లయితే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? ఒక వైపు సమైక్యవాదినంటారు.. మరోవైపు సోనియా గీచిన గీత దాటరు.

 

 ఉవ్వెత్తున ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు వారిని బెదిరించి సమ్మె విరమింప చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన బిల్లును 17 గంటల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక చేత్తో సైగ చేసి తన పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేల చేత సమైక్యాంధ్ర అనిపిస్తారు. ఇంకో చేత్తో సైగ చేసి తెలంగాణ ఎమ్మెల్యేల చేత రాష్ట్ర విభజన నినాదం చేయిస్తారు. ఈ క్షణం వరకూ చంద్రబాబు నోట ‘సమైక్యాంధ్ర’ మాటే రాలేదు. పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి జడిసి వీరిద్దరూ ఈ రోజు విభజన బిల్లును వెనక్కు పంపడానికి నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రాంతానికో మాట మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు తెరతీస్తున్న వేళ.. కార్యకర్త మొదలుకుని పార్టీ అధ్యక్షుడి వరకూ ‘సమైక్యాంధ్ర’ కోసం రాజీలేని పోరాటం చేసింది ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమే.

 

 ఢిల్లీకి సమైక్య పోరాటం..

 రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి మారుపేరుగా వైఎస్ నిలిస్తే.. వంచనకు, కుమ్మక్కుకు, వెన్నుపోటుకు ప్రతీకగా చంద్రబాబు చరిత్రలో స్థిరపడిపోయారు. మహానేత మరణించాక రాష్ట్రానికి కష్టాలొచ్చాయి. సోనియా తన కొడుకు కోసం ప్రజల భవిష్యత్తును అంధకారం చేసేలా రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేస్తోంది. దివంగత నేత స్ఫూర్తితో విభజన ప్రయత్నాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తుదికంటా అడ్డుకుంటోంది. ఇకపైసమైక్య పోరాటాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా కొనసాగిస్తుంది. అమ్మ విజయమ్మ, నేను, మన పార్టీ ఎమ్మెల్యేలు అందరం రాష్ట్రపతిని కలుస్తాం. అసెంబ్లీ వెనక్కు తిప్పి పంపిన బిల్లును పార్లమెంటుకు పంపడం భావ్యం కాదని ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఈ లోపు ఎన్నికల్లో మనం 30 పార్లమెంటు స్థానాలను సాధించి సమైక్యాంధ్రను శాశ్వతం చేసుకుందాం.’’

 

 పదకొండో రోజు యాత్ర సాగిందిలా...

 గురువారం చిత్తూరు జిల్లా తుమ్మల కుంటలో ధ్యానమందిర ప్రారంభోత్సవంతో సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మొదలైంది. తర్వాత పేరూరు మీదుగా జనార్దన నగర్ చేరుకున్న జగన్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి హరిపురం చేరుకుని, దివంగత నేత వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో చనిపోయిన చినసామి రాజు కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ నుంచి పేరూరు క్రాస్, తాటితోపు, చెర్లోపల్లి క్రాస్, వుదిపట్ల మీదుగా పెరుమాళ్ల పల్లి చేరుకుని అక్కడ దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం మీదుగా రాగిమాను కుంట చేరుకుని, వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మారయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ నుంచి చంద్రగిరి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించడంతో చిత్తూరు జిల్లాలో యాత్ర ముగిసింది. చివరిరోజు యాత్రలో జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top