హెలెన్ తుపానుతో జిల్లాలో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానున్నారు.
‘హెలెన్’విలయానికి చలించిన జగన్
Nov 25 2013 2:31 AM | Updated on Jul 25 2018 4:09 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ : హెలెన్ తుపానుతో జిల్లాలో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. పంటలు కోల్పోయిన రైతులు సహా ఇతర బాధితులను ఆయన పరామర్శించనున్నారు. జిల్లాలోని కోనసీమలో మెజారిటీ మండలాలకు తుపాను కారణంగా తీవ్రంగా నష్టం జరిగిందని పార్టీ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వ్యవసాయంతో సహా వివిధ రంగాలకు నష్టాన్ని జిల్లా నాయకుల ద్వారా తెలుసుకుని చలించిన జగన్ పర్యటనకు రానున్నట్టు తెలిపారు. జగన్ పర్యటన ఏయే నియోజకవర్గాల్లో నిర్వహించాలనే విషయమై పార్టీ జిల్లా నాయకత్వం కసరత్తు చేస్తోంది.
రాష్ట్ర విభజనకు జరుగుతున్న కుట్రలను పార్లమెంటులో అడ్డుకునేందుకు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులను కలుస్తున్న జగన్ ఈ నెల 26 లేదా 27న జిల్లాలో పర్యటించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ తేదీన వచ్చేది, పర్యటన ఎక్కడెక్కడ జరిగేది తదితర విషయాలను సోమవారం ఖరారు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు రానున్న జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడును వెళ్లబోసుకునేందుకు బాధితులు సిద్ధపడుతున్నారు. తుపాను తాకిడికి ప్రధానంగా కోనసీమలో వరి, కొబ్బరి, అరటి, కాయగూరల తోటలు తీవ్రంగా నష్టపోయాయి. ఆ రైతులు నేరుగా జగన్‌ను కలిసి జరిగిన నష్టాన్ని వివరించేలా జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13న పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు జిల్లా వచ్చిన జగన్ రెండు వారాలు తిరక్కుండానే మరోసారి జిల్లాకు రానున్నారు.
Advertisement
Advertisement