బడివడిగా..

YS Jagan Mohan Reddy Government Give Budget To The Amma Odi Scheme - Sakshi

పాఠశాలల్లో మౌలిక వసతులకు చర్యలు

బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట

ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 

జగన్‌ అమ్మఒడి పథకం వర్తింపు

మధ్యాహ్న భోజనం కార్మికులకు వేతనం పెంపు

రాయవరం (మండపేట): చదువు‘కొనే’ స్థితిలో నేడు పేదలే కాదు.. మధ్య తరగతివారూ లేరు. చదువు ఉంటేనే జ్ఞానం.. విజ్ఞానం. ఆదే క్రమంలో కుటుంబ అభివృద్ధి. చిన్నారులు చదువుకోవాలి. అందుకు పేదరికం కారణం కారాదన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన. ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చూసిన ఎన్నో సమస్యల్లో చదువు కొనలేని స్థితిలో ఎందరో ఉన్నారని గుర్తించారు. అక్కడ నుంచే మనసులో ప్రణాళికలు వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టాక ప్రాధాన్యాల క్రమంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా వివిధ రంగాల అభివృద్ధికి బాటలు వేశారు. ఈ క్రమంలో విద్యారంగం పటిష్టానికి చర్యలు తీసుకున్నారు.

కార్పొరేట్‌ విద్యకు ఏమాత్రం తీసిపోని రీతిలో సర్కారు విద్యను అందిస్తామని, అందుకు మౌలిక వసతులు కల్పించి విద్యార్థికి ఆ పాఠశాలలో చదవాలనే ఆసక్తి కలిగే వాతావరణం కల్పించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తల్లిదండ్రులకు పేదరికం అడ్డు కాకుండా వారి పిల్లలను పాఠశాలకు పంపిస్తే అమ్మఒడి పథకం కింద తల్లి ఖాతాలో విద్యార్థికి రూ.15 వేలు వేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా బడ్జెట్‌లో అందుకు నిధులు కేటాయించారు. మొత్తంగా విద్యారంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ముందుకు సాగిపోతున్నారు. పాలకులు నిధులు కేటాయించేశారు. ఇక మిగిలింది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపడం.. అధికారులు పాఠశాలల అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవడమే తరవాయి.

ఇంటర్మీడియట్‌ వరకూ అమ్మ ఒడి
ఈ పథకం కింద జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5.7 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 4.1 లక్షల మంది వరకు చదువుతుండగా, ఇంటర్మీడియట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి 60 వేల మంది ప్రయోజనం పొందనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మరో లక్ష మంది వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లాలో విద్యార్థులకు ఏటా రూ.765 కోట్లు ఈ పథకం కింద ఖర్చుయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో అమ్మఒడికి రూ.6,455.80 కోట్లు కేటాయించడం విశేషం.

జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థికి రూ.20వేలు
జగనన్న విద్యాదీవెన పథకం కింద ఉచిత విద్యను అందించేందుకు ఫీజు నూరు శాతం రీయింబర్స్‌ చేసేలా పథకాన్ని అమలు చేయనున్నారు. దీనితో పాటు వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఏడాదికి రూ.20వేల వంతున అందజేయనున్నారు. వీటికోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4,962 కోట్లు కేటాయించారు.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, రానున్న రెండేళ్లలో వాటి రూపురేఖలు మార్చనున్నట్లు సీఎం జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించారు. జిల్లాలో 4,416 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అధ్వానంగా, మధ్యస్తంగా ఉన్న పాఠశాలలకు ఈ మేరకు లబ్ధి చేకూరనుంది.

‘గౌరవం’ పెరిగింది
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వర్కర్లకు గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. దీంతో ఆ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.1,077 కోట్లు కేటాయించారు. జిల్లాలో 4,283 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 7,563 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top