ప్రబోధానంద ఆశ్రమ బాధితులకు అండగా ఉంటాం

YS Jagan assured to victims of prabodhananda ashram issue - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం: ప్రబోధానంద ఆశ్రమ భక్తులకు అండగా ఉంటామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమంపై జేసీ సోదరుల వర్గీయులు దాడి చేయడంపై బాధితులు సోమవారం విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీకి అనుకూలంగా లేమని జేసీ వర్గీయులు దాడి చేస్తున్నా పోలీసులు, ఓ వర్గం మీడియా వారికే అండగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వారి దాడిలో వెయ్యి మందికి పైగా గాయపడి ఆసుపత్రి పాలైనా, 40 వరకు వాహనాలు దగ్ధమైనా ఆశ్రమానికి న్యాయం జరగలేదన్నారు. పేరుకు 144 సెక్షన్‌ విధించినా ప్రశాంతంగా ఉండాల్సిన చోట మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయన్నారు.

ఇదంతా ఆశ్రమానికి చెందిన పది ఎకరాల స్థలం కాజేయడానికేనని ప్రబోధానంద సేవా సమితి ప్రతినిధులు అద్దంకి గిరిబాబు, భూలక్ష్మి, శంకరరావు, అనిల్‌కుమార్‌లు జగన్‌కు వివరించారు. దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. విశాఖపట్నంలో ఉన్న తన దాకా ఆశ్రమం భక్తులు వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. ‘నిజంగా తాడిపత్రిలో రౌడీరాజ్యం చెలరేగిపోతుంటే ముఖ్యమంత్రి తన వాళ్లను కట్టడి చేయడం లేదు.  రౌడీయిజం పేట్రేగిపోయేలా ప్రోత్సహిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం. ఏకంగా స్వాముల ఆశ్రమంలో చొరబడి భక్తులు, ఆడవాళ్లని కూడా చూడకుండా దాడి చేశారు.

ఆశ్రమంలో స్వామితో విభేదించే విధంగా చంద్రబాబు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో రౌడీయిజం చెలరేగి పోవడానికి చంద్రబాబే కారణం. పశ్చిమగోదావరిలో చింతమనేని ప్రభాకర్‌ను తీసుకున్నా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు దౌర్జన్యంగా మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయి కొట్టారు. ఇలాంటి రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను, రాజకీయ నాయకులను బొక్కలో వేసి నాలుగు తంతే ఇటువంటివి జరుగకుండా ఉంటాయి. మా పార్టీ తరఫున స్వామి వారికి అండగా నిలబడతామని చెప్పండి. దేవుడు చెప్పిన్టటుగానే అన్యాయం ఎక్కువ కాలం బతకదు’ అని జగన్‌ అన్నారు.  

జేసీ బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలి
ఐదు రాష్ట్రాల్లో శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి శిష్యులం సుమారు ఐదు లక్షల మంది ఉన్నాం. తాడిపత్రి మండలం చిన్నపడమలలో ఉన్న స్వామివారి ఆశ్రమంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అనుచరులు దాడులు చేయడం దారుణం. సాక్షి మీడియా ఒక్కటే వాస్తవాలను ప్రసారం చేసింది. ఆశ్రమానికి కరంటు, నీటి సరఫరా కూడా నిలిపేశారు. టీడీపీకి మద్దతు ఇవ్వలేదని ఇలా దాడులు చేస్తారా? 
– ప్రభోదానంద సేవా సమితి సభ్యులు సంతోష్, శాంతరాజు, శ్రీదేవి, పద్మలత 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top