క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడు

Young Man Suffering With Cancer Waiting For Helping Hands - Sakshi

ఆపన్న హస్తాల కోసం ఎదురుచూపు

శ్రీకాకుళం, మందస: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. కుమారుడు ప్రయోజకుడై ఉద్దరిస్తాడని భావించారు. ఆ యువకుడు క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడి పోరాడుతున్నాడు. మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన శిస్టు రామ్మూర్తి, జయమ్మ దంపతులు కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. వీరికి పూర్ణచంద్రరావు, గిరి అనే ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు గిరి బీఈడీ కూడా పూర్తి చేశారు. ఇంటి వద్ద ఉంటే ఉద్యోగాలు రావని విజయనగరంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ సమయంలో బాగులేకపోవడంతో చికిత్స తీసుకున్నాడు.

లివర్‌ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. నిండా పాతికేళ్లు కూడా నిండని గిరికి క్యాన్సర్‌ సోకిందని తెలియడంతో తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు కూడా నివ్వెరపోయారు. ప్రస్తుతం గిరికి క్యాన్సర్‌ చికిత్స జరుగుతోంది. తల్లిదండ్రులు ఉన్న కొద్దిపాటి పొలం విక్రయించి రూ.2లక్షల వరకు వైద్యానికి ఖర్చుపెట్టారు. మరో రూ.5లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులకు అల్లాడుతున్నారు. ఆస్పత్రిలో కుమారుడి పరిస్థితి చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాతల సాయం చేస్తే గిరి బతుకుతాడని ఆశిస్తున్నారు. ఎస్‌బీఐ ఖాతా నంబర్‌ 11691928972 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బిఐఎన్‌ 0003121)కు దాతలు డబ్బులు జమ చేయాలని స్నేహితులు కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top