డూండీ..లేడండి ! | This Year No Doondy Ganesh In Vijayawada | Sakshi
Sakshi News home page

డూండీ..లేడండి !

Sep 11 2018 1:50 PM | Updated on Sep 11 2018 1:50 PM

This Year No Doondy Ganesh In Vijayawada - Sakshi

మూడేళ్లుగా విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డూండీ గణేష్‌ ఉత్సవాలు ఈ ఏడాది లేనట్టేననే విషయం స్పష్టమైంది. నగరవాసులకు ఈ ఉత్సవాలు మూడేళ్ల ముచ్చటగానే మిగిలాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ వినాయకుడికి దీటుగా డూండీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించేవారు. ఈ ఏడాది విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ శాఖలు అనుమతి మంజూరు చేయలేదు. డూండీ ఉత్సవాలకు నిర్వాహకులు రాజకీయాలు పులమడం, అవినీతి ఆరోపణలు, కమిటీ సభ్యులు ముజ్రా పార్టీలో అడ్డంగా దొరకటం వంటి కారణాలతో పోలీసు, రెవెన్యూ అధికారులు అనుమతుల మంజూరుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

సాక్షి, విజయవాడ : విజయవాడలో  డూండీ గణేష్‌ ఉత్సవ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహం ఏర్పాటులో కీలక పాత్ర పోషించే వారంతా నగర శివారులోని ఒక  హోటల్‌లో ఇటీవల నిర్వహించిన ముజ్రా పార్టీలో పోలీసులకు దొరికారు. ఉత్సవ నిర్వాహకులు పట్టుబడగా.. అధికారపార్టీతో వారికున్న సాన్నిహిత్యంతో కీలక వ్యక్తులను తప్పించారు. ఆ తరువాత కూడా డూండీ గణేష్‌ విగ్రహం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఒక వ్యక్తి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ చుట్టూ పార్టీలో ఉన్నవారిని విడిపించేందుకు కాళ్లు అరిగేలాగా తిరిగాడు. ఒక వైపు గణేష్‌ పూజలు చేస్తూ.. మరొకవైపు ముజ్రా పార్టీలు నిర్వహించడంతో పోలీసు, రెవెన్యూ వర్గాలు సీరియస్‌ అయ్యాయి.  ముజ్రా కేసు నుంచి తప్పించాలంటే డూండీ గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు స్వస్తి పలకాలనే మెలిక పోలీసు అధికారులు పెట్టినట్లు సమాచారం.

అనుమతులు లేకుండానే భూమి పూజ....
ఈ ఏడాది స్వరాజ్యమైదానంలో డూండీ గణేష్‌ ఉత్సవాలు పెద్ద ఎత్తున  నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు అక్కడ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు భూమి పూజ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం  సీరియస్‌ అయ్యారు. దీంతో  ఈ డూండీ గణేష్‌ విగ్రహానికి ఏర్పాట్లు కోసం మంత్రుల నుంచి ఒత్తిడి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో  స్వరాజ్యమైదానంలో ఉత్సవాలకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అనుమతి వస్తుందనే సమాచారం తెలుసుకున్న నిర్వాహకులు భారీగా వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. నగరంలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వద్ద కనీసం రూ.2 కోట్లు వసూలుచేయాలని, ఒక్కో సంస్థ నుంచి రూ.50వేల నుంచి  రూ.లక్షల వరకు  వసూలు చేసేందుకు వ్యూహాలు పన్నారు. డూండీ గణేష్‌  ఉత్సవాలకు అనుమతి లేకపోవడంతో నగరంలోని బడా వ్యాపారులు మాత్రం  ఎంతో సంతోషించారని సమాచారం.ఈ ఏడాది చందాల బాధ తప్పిందని ఊపిరిపీల్చుకున్నట్లు తెలిసింది. గాంధీనగర్, సత్యనారాయణపురంలోని వ్యాపార వర్గాల్లో ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.

డూండీ చరిత్ర ఇలా....
ఘంటసాల వెంకటేశ్వర సంగీత కళాశాలలో తొలిసారి 2015 లో డూండీ గణేష్‌ 63 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.  ఆ తర్వాత 2016 లో కూడా సంగీత కళాశాలలోనే 72 అడుగుల విగ్రహం పెట్టారు. 2017 లో జింఖానా గ్రౌండ్స్‌లో 72 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ ఏడాది  స్వరాజ్య మైదానంలో విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని నిర్వాహకులు భావించగా ఆదిలోనే హంసపాదు తగిలింది. తొలి ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా డూండీ వైభవం మార్మోగింది. రెండో ఏడాది నుంచి క్రమంగా రాజకీయనాయకులు జోక్యం చేసుకోవడంతో ఉత్సవాలపై ప్రజలు ఆసక్తి కనబర్చలేదు. ఈ ఏడాది అసలుకే ఎసరొచ్చి అసలు ఉత్సవాల నిర్వహణకే అనుమతి మంజూరు నిలిపివేయడంతో ఇక డూండీ గణేష్‌ చరిత్ర మూడేళ్లకే కనుమరుగైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement