ఉల్లంఘనులు ఉక్కిరిబిక్కిరి

Yarapathineni Srinivasa Rao In Deep Trouble Over Gurazala Illegal Mining - Sakshi

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

ఐదేళ్లలో వేల కోట్ల రూపాయల విలువైన సున్నపురాయి లూటీ

సీబీసీఐడీ అధికారుల విచారణలో బట్టబయలవుతున్న అవినీతి బాగోతం

మనీ ల్యాండరింగ్‌కూ పాల్పడినట్టు అనుమానాలు

కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం

సాక్షి, గుంటూరు: ఒకప్పుడు అప్పులు తప్ప ఆస్తులు లేవు.. ఆంధ్రా సీడ్స్‌కు అప్పులు ఎగ్గొట్టిన చరిత్ర అతనిది.. 2014 సంవత్సరానికి ముందు ఎన్నికల నిర్వహణ ఖర్చులు పెట్టుకోవడానికి ఇబ్బందులు పడ్డ వ్యక్తి ఆయన.. చివరకు కార్యకర్తల చందాలతో గెలుపొందాడు. అనంతరం ఐదేళ్ల టీడీపీ పాలనలో పల్నాడులో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడు. రూ.వేల కోట్ల ఖనిజ సంపదను దోచేశాడు. ఇలా దందాకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాపం పండింది. అక్రమ మైనింగ్‌ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజ వనరులను దోచుకున్న యరపతినేని, ఆయన అనుచరుల అస్తులను జప్తు చేస్తారని ప్రచారం సాగుతోంది.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలో కోనంకి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కేశానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్‌ టన్నుల తెల్లరాయి (లైమ్‌ స్టోన్‌)ని దోచేశారు. యరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్‌పై గత ఏడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణ చేపట్టింది.

ఇప్పటి వరకూ అక్రమ మైనింగ్‌పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను షీల్డ్‌ కవర్‌లో గత సోమవారం అధికారులు హైకోర్టు ముందుంచారు. మనీ ల్యాండరింగ్‌ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించకూడదో తెలపాలంటూ ధర్మాసనం యరపతినేనని ప్రశ్నించింది. రాష్ట్ర  ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు విచారణను కోరే వ్యవహారంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

గుండెల్లో రైళ్లు..
కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తు బదలాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏడాదిపాటు అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీలు అక్రమ మైనింగ్‌ కారణంగా రూ. వేల కోట్లు గడించినట్టు గుర్తించారు. మైనింగ్‌ మాఫియాలో కీలక సభ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు మొదలైన వ్యక్తులు యరపతినేని బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే.

గత ఐదేళ్లలో వీరందరూ అక్రమ మైనింగ్‌ కారణంగా రూ. కోట్లు సంపాదించినట్టు దర్యాప్తులో వెలువడినట్టు పోలీస్‌ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్‌ కేసు బదలాయిస్తున్నట్టు తెలుస్తుండటంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తును అప్పగిస్తే ఆయా సంస్థలు అక్రమంగా సంపాదించిన ఆస్తులను అటాచ్‌ చేస్తాయని మైనింగ్‌ మాఫియా సభ్యులు భయపడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top