బీసీలకు భరోసా..

Y S Jagan Reddy to allocate Rs 15,000 cr for Backward Castes welfare - Sakshi

వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్ద పీట

బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061.64 కోట్ల కేటాయింపుతో నిధుల వరద

ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపు ఇదే తొలిసారి

బీసీల పిల్లల కోసం జగనన్న    అమ్మ ఒడికి రూ.1,294.73 కోట్లు

వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద రూ.300 కోట్లు నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు

వైఎస్సార్‌ ఆర్థిక సాయం కింద రూ.300 కోట్లు

చేనేత కార్మికులకు వైఎస్సార్‌ ఆర్థిక సాయం కోసం రూ.200 కోట్లు

బీసీ కులాల కోసం 139 ప్రత్యేక కార్పొరేషన్లు ప్రమాదవశాత్తు మరణించిన

బీసీ కులాల వారికి రూ.5 లక్షల సాయం

సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ కాదు బ్యాక్‌ బోన్‌.. అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి తన ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే వారి అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు ఏకంగా రూ.15,061.64 కోట్లు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో బీసీలకు కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. అందులో బీసీలకు ఏటా రూ.15,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75,000 కోట్లు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

అప్పుడు ఇచ్చిన మాట మేరకు ప్రస్తుత తొలి బడ్జెట్‌లోనే బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061.64 కోట్లు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కోసం వినియోగించుకుంది తప్ప వారి అభ్యున్నతి, సంక్షేమం గురించి పట్టించుకోలేదు. కాగా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2019–20 వార్షిక బడ్జెట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు సమగ్రాభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు.

ఇందుకోసం మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా రూ.15,061.64 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. బీసీ ఉప ప్రణాళికలో కేటాయించిన నిధులతో బీసీ వర్గాలు వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ఈ నిధులతో వెనుకబడిన వర్గాల నివాస ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. బీసీ కమిషన్‌ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు పునర్‌ నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని బడ్జెట్‌లో స్పష్టం చేసింది. ప్రమాదవశాత్తు మరణించిన బీసీ కులాలకు చెందిన వారికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షల సాయం అందించనుంది.

నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు మంచి రోజులు
ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10,000 వరకు నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఆదాయ మద్ధతును ఇవ్వాలని నిర్ణయించినట్లు బడ్జెట్‌లో స్పష్టం చేసింది. ఇందు వల్ల వారి యంత్రాలను ఆధునికీకరించుకుని, అధిక ఆదాయం ఆర్జించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయీ బ్రాహ్మణులకు, 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు బడ్జెట్‌లో స్పష్టం చేసింది. దర్జీలకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల చొప్పున ఆదాయ మద్దతును ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.100 కోట్లు  కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

29 బీసీ కులాల కార్పొరేషన్లకు రూ.3,964.05 కోట్లు
ప్రస్తుతం అమల్లో ఉన్న బీసీ కులాలకు చెందిన 29 కార్పొరేషన్లకు ఈ బడ్జెట్‌లో బీసీ ఉప ప్రణాళికలో భాగంగా రూ.3964.05 కోట్లు కేటాయించారు. ఈ 29 కులాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వీరి జీవనోపాధి కోసం వివిధ పథకాల కింద ఆర్థిక సాయం చేయనున్నారు. సబ్సిడీలతో పాటు ఆర్థిక సాయం అందించనున్నారు.

చేనేత కుటుంబాలకు చేయూత
చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశారు. ప్రతి చేనేతకారుడి కుటుంబానికి రూ.24 వేల చొప్పున వైఎస్సార్‌ పేరుతో ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సాయం చేనేత కార్మికులు తమ పరికరాలను ఆధునికీకరించుకుని మర మగ్గాల ఉత్పత్తులతో పోటీపడేందుకు ఉపయోగపడనుంది. చేనేత కార్మికులు గౌరవప్రదమైన ఆదాయం ఆర్జించడానికి అవసరమైన మార్కెటింగ్‌ సహాయాన్ని ఇతర సబ్సిడీలను కూడా ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది.

వధువులకు వైఎస్సార్‌ పెళ్లి కానుక  
బీసీ గర్జన, మేనిఫెస్టోలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తొలి బడ్జెట్‌లోనే బీసీ వర్గాలకు పెళ్లి కానుకను తీసుకువచ్చారు. వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద రూ.300 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద బీసీ కులాలకు చెందిన వధువులకు రూ. 50,000 చొప్పున వివాహ కానుక ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 75 వేల మంది బీసీ వధువులు ప్రయోజనం పొందనున్నారు. కాగా.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు వచ్చే సంవత్సరం నుంచి వైఎస్సార్‌ చేయూత కింద ప్రయోజనాలు పొందనున్నారు. వీరికి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, ఇతర ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ ఏడాదిలోనే లబ్ధిదారులను గుర్తించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో సంబంధిత కార్పొరేషన్ల ద్వారా అర్హులందరికీ దీనిని అమలు చేయాలని నిర్ణయించారు.

బీసీ విద్యార్థులకు అన్ని విధాల అండ  
రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్‌లో రూ.2,218.14 కోట్లు కేటాయించారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు కేటాయించ లేదు. చదువుకునే వయసు  పిల్లలందరూ విద్యా సంస్థల్లోనే ఉండాలనే లక్ష్యంతో జగనన్న అమ్మ ఒడి పథకం కింద బీసీ వర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఈ పథకం కింద బీసీ వర్గాలకు చెందిన పిల్లలను బడికి పంపిస్తే వారి తల్లులకు ఏటా రూ.15,000 ఇచ్చేందుకు బీసీ ఉప ప్రణాళికలో రూ.1294.73 కోట్లు కేటాయించారు.

ఆటో డ్రైవర్లకు రూ.400 కోట్లు
ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు జిల్లాల్లో ఆటో డ్రైవర్లు ఆయన్ను కలిసి వారి ఇబ్బందులను, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సొంతంగా ఆటో కలిగి నడుపుకుంటున్న డ్రైవర్లందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే తన తొలి బడ్జెట్‌లోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అదించేందుకు ఏకంగా రూ.400 కోట్లు కేటాయించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బడ్జెట్‌లో కేటాయింపులు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కిందని ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక కార్పొరేషన్‌తో ప్రతి కులానికీ భరోసా
మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా వెనుకబడిన తరగతుల్లోని కులాల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుందని బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ కార్పొరేషన్లు వివిధ బీసీ ఉప–సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లను సంస్కరించాక వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది.

ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ అభ్యున్నతి కోసం దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులు, మార్కెట్‌ యార్డ్‌ కమిటీలు, కార్పొరేషన్లు తదితర నామినేటెడ్‌ పోస్టుల విషయంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం తీసుకురావని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వం నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో ఈ వర్గాల ఆర్థిక ఔన్నత్యం కోసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని బడ్జెట్‌ స్పష్టం చేసింది.


వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో బీసీల సంక్షేమం కోసం పేర్కొన్న భాగం. ఈ హామీలన్నింటినీ నెరవేర్చేందుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించారు.

► 7.82 లక్షల బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,218.14 కోట్లు
► ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి అందించనున్న సాయం రూ.24,000
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top