ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున కేంద్రానికి సమైక్య లేఖ రాయండి


* సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులతో జగన్‌

* ఆ లేఖపై అన్ని పార్టీల అధ్యక్షుల సంతకాలు తీసుకోండి

* వైఎస్సార్‌ సీపీ తరఫున నేను మొదటి సంతకం చేస్తా..

* సమైక్య రాష్ట్రం డిమాండ్‌తోనే మేమంతా రాజీనామాలు చేశాం

* మిగతా పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామా చేస్తే కేంద్రం వెనక్కు తగ్గుతుంది

* రేపు ఢిల్లీలో ఉద్యోగుల ధర్నాకు వైఎస్‌ విజయమ్మ



సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఆ లేఖపై అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సంతకాలు చేయించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు బుధవారం జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో తాము చేస్తున్న పోరాటాన్ని ప్రతినిధులు వివరించగా, వారి పోరాటానికి జగన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.



విభజన ప్రక్రియ ఆపడానికి ఉద్యోగ సంఘాలు చొరవ తీసుకుని జేఏసీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, దానిపై అన్ని పార్టీల అధ్యక్షుల సంతకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమైక్య ఉద్యమానికి శాయశక్తులా, అన్ని విధాలుగా మద్దతునిస్తానని చెబుతూ.. ఉద్యోగ సంఘాలు రాసే లేఖపై తాను తొలి సంతకం చేస్తానని కూడా జగన్‌ తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తోనే తనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు సమర్పించారని చెప్పారు. అలాగే మిగతా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేస్తే విభజన నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గుతుందని, అందువల్ల మిగతా రాజకీయ పార్టీలను కూడా రాజీనామాలకు డిమాండ్‌ చేయాలని సూచించారు.



రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని, ఆ కార్యక్రమంలో పాల్గొని మద్దతునివ్వాలని ఫోరం ప్రతినిధులు జగన్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున తాను రాలేనన్న జగన్‌.. మీ ఆందోళన సమంజసమైనందున మీరు చేపట్టే కార్యక్రమానికి మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్వయంగా హాజరవుతారని చెప్పారు. ఉద్యోగ సంఘాలు నిర్వహించే ఆందోళనలకు తమ పార్టీ పూర్తి మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. సమావేశం అనంతరం ఫోరం చైర్మన్‌ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు.



సమైక్య రాష్ట్రం కోరుతూ ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు ఆహ్వానించడానికి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్టు చెప్పారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున తాను రాలేనని, ఉద్యమానికి మద్దతుగా పార్టీ ప్రతినిధులను తప్పనిసరిగా పంపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం చివరిదాకా పోరాటం చేస్తానని జగన్‌ తమతో అన్నారన్నారు. ఇప్పటికే తాను, మరో ఎంపీ, ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటున్న విషయం గుర్తుచేశారని చెప్పారు. ఇతర పార్టీల అధ్యక్షులు కూడా రాజీనామా చేసి ముందుకొస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని జగన్‌ వివరించారన్నారు. తామంతా 56 రోజులుగా ఉద్యమిస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగా ఢిల్లీలో ధర్నా చేపడుతున్నట్టు జగన్‌కు తెలిపామని మురళీకృష్ణ చెప్పారు.



బుధవారం ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లిన తర్వాత ఢిల్లీలో చేపట్టే కార్యక్రమాలను వివరించామన్నారు. భావితరాలు నష్టపోకుండా ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని, ఉద్యమాన్ని బాగా నడిపిస్తున్నారని ఈ సందర్భంగా జగన్‌ అభినందించినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం జగన్‌ తమకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారని ఫోరం నాయకురాలు సత్యసులోచన చెప్పారు. జగన్‌ మాదిరిగా కిరణ్‌, చంద్రబాబులు రాజీనామా చేయాలి





సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాజీనామాలు చేయాలని సచివాలయ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. జగన్‌ మాదిరిగా కాంగ్రెస్‌, టీడీపీ ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలు చేయకుండా వారెన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. రాష్ట్ర విభజనకు అంగీకారం తెలుపుతూ చంద్రబాబు ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విభజన లేఖను వెనక్కి తీసుకోకుండా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు విశ్వసించరన్నారు. లేఖను వెనక్కి తీసుకునే దాకా టీడీపీ నేతలకు సమైక్య ఉద్యమంలో పాల్గొనే అర్హతలేదన్నారు. జగన్‌ను కలిసిన వారిలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్‌ వెంకటసుబ్బయ్య, నేతలు హరీష్‌కుమార్‌రెడ్డి, హేమలత తదితరులున్నారు.



నేడు ఢిల్లీలో కొవ్వొత్తులతో ర్యాలీ.. రేపు మహాధర్నా

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో సమైక్య సమర నినాదం చేయనున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మూడురోజుల పాటు ఆందోళనలు చేపట్టనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులు హస్తినకు చేరుకోగా.. బుధవారం రాజధాని ఎక్‌‌సప్రెస్‌లో వందలాది మంది ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆందోళనల్లో భాగంగా 26న ఏపీ భవన్‌ నుంచి ఇండియాగేట్‌ వరకూ కొవ్వొత్తులతో ర్యాలీ, 27న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తారు.



28న కూడా ఆందోళనలు కొనసాగిస్తామని ఫోరం నేతలు తెలిపారు. వీలైతే రాష్టప్రతి ప్రణబ్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించాలని సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న పలువురు రాష్ట్ర ఎంపీలను కలిసిన ఉద్యోగుల ప్రతినిధి బృందం.. మహాధర్నాలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతు తెలిపాలని కోరింది. ఎస్పీ, జేడీ(యూ), బీజేపీ తదితర పార్టీల జాతీయ నేతలను కూడా కలిసి ఆందోళనకు మద్దతు పలకాలని నేతలు విన్నవించారు. కాగా, ఉద్యోగుల ధర్నాకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సంఘీభావం ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top