పౌష్టికాహారంలో పురుగులు

Worms Found In Nutrition Food Of Childrens In Vizianagaram - Sakshi

సాక్షి, బలిజిపేట(విజయనగరం) : గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారంలో పురుగులు కనిపిస్తుండడంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు.  అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలు, గుడ్లు, శనగ చెక్కీలు, నువ్వు చెక్కీలు నాణ్యంగా ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాసిరకంగా ఉన్న ఉండలను తినడానికి ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు భయపడుతున్నారు. పొరపాటున చూడకుండా వాటిని తింటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గుడ్లు కూడా పూర్తిగా కుళ్లిపోవడంతో ఇవేం గుడ్లని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పౌష్టికాహార పదార్థాలు పాడవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.అలాగే పాల ప్యాకెట్లను కేంద్రాల కార్యకర్తలు ఇచ్చే ఇండెంట్‌ ప్రకారం మొత్తం సరుకును ఒకేసారి సరఫరా చేస్తున్నారు.

దీంతో వచ్చిన పాలప్యాకెట్లను కేంద్రాలలో నిల్వ చేయాల్సి వస్తోంది. రోజుల తరబడి పాల ప్యాకెట్లు ఉంచాల్సి రావడంతో పాడవుతున్నాయని కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్ట్‌ పొందిన కాంట్రాక్టర్లు సరైన సమయానికి సరుకులు సరఫరా చేసిన దాఖాలు లేవు. గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ గుడ్డు, పాలు, శనగ, నువ్వు చెక్కీలు ఇవ్వాల్సి ఉంది. అయితే సరుకు ఒకేసారి రావడం... వాటిని నిల్వ చేసి ఇవ్వడంతో పాడుతున్నాయి.  చిలకలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఊర్మిల అనే లబ్ధిదారుకు బుధవారం సరఫరా చేసిన చెక్కీలలో పురుగులు కనిపించాయి. అలాగే గుడ్లు కూడా కూళ్లిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఈ ఒక్క కేంద్రానిదే కాదని.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

గర్భిణిలు, బాలింతలు, ప్రీ స్కూల్‌ చిన్నారులకు ఇవ్వాల్సిన మెనూ..
►  సోమ, గురువారాలలో: సాంబారు, అన్నం
►  మంగళ, శుక్రవారాలలో పప్పు, ఆకుకూర, అన్నం.
►  బుధ, శనివారాలలో కాయగూర లేదా  ఆకుకూరతో పప్పు, అన్నం.
►  సోమవారం నుంచి శనివారం వరకు గర్భిణిలు, బాలింతలకు గుడ్లు, పాలు, శనగ, నువ్వు చెక్కీలు 
►  3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు నాలుగు రోజులు గుడ్లు. (గురువారం, శనివారం ఉండవు)
►  3 సంవత్సరాల లోపున్న వారికి వారానికి 2 రోజుల మాత్రమే గుడ్లు పంపిణీ చేస్తారు.
►  3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులలో బరువు తక్కువ ఉండేవారికి బరువు పెరిగేవరకు పాలు పంపిణీ చేస్తారు.

కార్యకర్తలు చూసుకోవాలి
కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులను కార్యకర్తలే చూసుకోవాలి. చెక్కీలు, పాలు నెలకొకసారి సరఫరా అవుతున్నాయి. గుడ్లు 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అటువంటప్పుడు చూసుకోవాలి. పాడైతే అధికారుల దృష్టికి తీసుకురావాలి.                                   
– ఉమాభారతి, సీడీపీఓ, బొబ్బిలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top