రోడ్ల విస్తరణ నిధులు దారిమళ్లింపు..

World Bank is deeply dissatisfied about roads expansion funds - Sakshi

ప్రపంచ బ్యాంకు తీవ్ర అసంతృప్తి

రూ.183.72 కోట్ల పనుల ఖర్చుపై అభ్యంతరం

రోడ్ల ప్రాజెక్టులో భూసేకరణ, పరిహారంపైనా అసంతృప్తి

ఆరు ప్యాకేజీల్లో రెండు మాత్రమే పూర్తి

సీఎస్‌కు ఘాటుగా లేఖ రాసిన ప్రపంచ బ్యాంకు ఇండియా ప్రతినిధి

సాక్షి, అమరావతి: ఏపీలో రోడ్‌ సెక్టార్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన రోడ్ల విస్తరణ పనుల నిమిత్తం మంజూరు చేసిన నిధులు దారి మళ్లడంపై ప్రపంచ బ్యాంకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రపంచ బ్యాంకు కితాబిచ్చిందని ఆర్భాటంగా చెప్పుకునే చంద్రబాబు సర్కారుకు ఇది చెంప పెట్టులాంటిదే. ఈ విషయమై ప్రంపంచ బ్యాంకు ఇండియా ప్రతినిధి జార్జ్‌ ఏ కొరాసా ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘాటుగా లేఖ రాశారు.  

ఏపీలో ఆరు ప్యాకేజీల కింద రోడ్ల విస్తరణ పనులు
రోడ్‌ సెక్టార్‌ ప్రాజెక్టు కింద ఏపీలో ఆరు ప్యాకేజీలుగా చిత్తూరు–పుత్తూరు, మైదుకూరు–జమ్మలమడుగు, కర్నూలు–దేవనకొండ, పెడన–నూజివీడు–విస్సన్నపేట, కాకినాడ–రాజమండ్రి రోడ్ల విస్తరణ పనుల్ని దీర్ఘకాలంగా నిర్వహించాల్సిన కాంట్రాక్టులుగా (లాంగ్‌ టర్మ్‌ బేస్డ్‌ మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్సు)పరిగణించి ప్రపంచ బ్యాంకు ఎనిమిదేళ్ల క్రితం రూ.1,400 కోట్లను రుణంగా మంజూరు చేసింది. 2015వ సంవత్సరం నాటికి ప్రాజెక్టు గడువు ముగించాలని సూచించింది. అయితే 2015నాటికి కేవలం చిత్తూరు–పుత్తూరు, మైదుకూరు–జమ్మలమడుగు ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. ఆరు ప్యాకేజీల్లో రెండు ప్యాకేజీలు పూర్తవగా, మిగిలిన నాలుగు ప్యాకేజీల పనులపై ప్రతిష్టంభన నెలకొంది. కాకినాడ–రాజమండ్రి రోడ్డు విస్తరణ పనుల నుంచి ఒప్పంద కాంట్రాక్టరు తప్పుకోవడంతో ప్రభుత్వం మళ్లీ ఈ పనిని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచింది. పెడన–నూజివీడు–విస్సన్నపేట రోడ్డు విస్తరణలో జాప్యం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్టు పనులు ఇంకా 20 శాతం కూడా పూర్తి కాలేదు. చివరగా ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది డిసెంబరు 31ను ప్రాజెక్టు తుది గడువుగా నిర్ణయించింది.

రూ.183.72 కోట్ల పనుల ఖర్చుపై తీవ్ర అభ్యంతరం
రోడ్ల విస్తరణ పనుల్లో రూ.183.72 కోట్లను దారిమళ్లించారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సీఎస్‌కు రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సమర్పించిన లెక్కలు సరిగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్గత ఆడిట్‌ సరిగా లేదని, 2015 నుంచి చేసిన ఖర్చుపై వివరాలు పంపకపోవడాన్ని బట్టి చూస్తే ఏం సంకేతం ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధి 2017–18 ఆర్థిక ఏడాదిలో ఈ రోడ్ల విస్తరణ పనులపై ‘కాగ్‌’ చేసిన ఆక్షేపణను తన లేఖలో ప్రస్తావించడం గమనార్హం. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కింద ఇచ్చిన రూ.57.87 కోట్లను ప్రాజెక్టు గడువు తీరేలోగా తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంపై అసంతృప్తి
రోడ్ల ప్రాజెక్టుకు చేపట్టే భూ సేకరణ వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాస, పునర్నిర్మాణ పనులపైనా ప్రపంచ బ్యాంకు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండేళ్లుగా రోడ్ల విస్తరణ వల్ల నిర్వాసితులైన 800 కుటుంబాలకు పరిహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కాకినాడ–రాజమండ్రి రహదారి విస్తరణ వల్ల 300 కుటుంబాలకు ఇంకా పరిహారం చెల్లించలేదు. ఇటీవలే ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఏపీలో రోడ్ల ప్రాజెక్టులను పరిశీలించింది. ఇప్పుడు సీఎస్‌కు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ఘాటుగా లేఖ రాయడం ప్రభుత్వ వర్గాల్లో  కలకలం రేపుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top