అతివలకు అండ

Women Employment In Police Stations At Kurnool - Sakshi

మహిళా మిత్రల నియామకానికి పోలీసు శాఖ కసరత్తు

కర్నూలు రేంజ్‌ పరిధిలో నెలాఖరులోగా ప్రారంభం 

మహిళల రక్షణలో కీలక మైలురాయి!

సాక్షి, కర్నూలు : మహిళల రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు శాఖలో సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ఈ వ్యవస్థ రాష్ట్రం మొత్తం విస్తరణలో భాగంగా జిల్లాలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా కర్నూలు రేంజ్‌ పరిధిలోని వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లోని అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా మిత్రలను నియమించనున్నారు.

మహిళా మిత్రలు ఏం చేస్తారంటే.. 
వివిధ రకాల ఇబ్బందులకు గురయ్యే మహిళల్లో చాలామంది..పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకొచ్చే పరిస్థితి నేటికీ పూర్తిస్థాయిలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులకు సాయపడడానికి ‘మహిళా మిత్ర’ల పేరిట సుశిక్షితులైన మహిళలను నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. బాధితులకు స్వచ్ఛందంగా సేవలందించడానికి ముందుకు వచ్చేవారినే ‘మహిళా మిత్ర’లుగా ఎంపిక చేస్తారు. వారికి మహిళా రక్షణకు అందుబాటులో ఉన్న చట్టాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. ప్రతి స్టేషన్‌కు కనీసం ఇద్దరు ‘మహిళా మిత్ర’లు ఉండేలా చర్యలు చేపడతారు. అలాగే ప్రతి  స్టేషన్‌లోనూ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సమన్వయకర్తల బాధ్యతలు అప్పగిస్తారు. ‘మహిళా మిత్ర’లు ఇచ్చే సమాచారంపై  కానిస్టేబుళ్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ లేదా ఇతర అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటారు. ‘మహిళా మిత్ర’లు ప్రాంతాల వారీగా విద్యా సంస్థలు, అపార్ట్‌మెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో మాట్లాడి.. మహిళా గ్రూపులు ఏర్పాటు చేయిస్తారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చైతన్యం తీసుకురావడానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.  

మహిళల భద్రతలో విప్లవాత్మక మార్పు 
 ‘మహిళా మిత్ర’ వ్యవస్థ ఏర్పాటు విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. చైతన్యవంతులైన మహిళలను ఈ వ్యవస్థలోకి తీసుకొని.. మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షనీయం. ఈ వ్యవస్థ వల్ల సమస్యలను ప్రాథమిక దశలోనే తెలుసుకునే అవకాశం కలుగుతుంది. 
–దాశెట్టి శ్రీనివాసులు, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు

చట్టాలపై అవగాహన ఉన్నవారిని నియమించాలి 
పోలీసు శాఖలో మహిళా మిత్రల ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే చట్టాలపై సమగ్ర అవగాహన ఉన్న వారిని నియమిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అన్యాయానికి గురైన వారికి ఎలాంటి సాయం అందించాలనే విషయంలో వీరు వారధులుగా పనిచేయాలి.   
– పి.నిర్మల, న్యాయవాది, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top