పెద్దరావిగూడెంలో కిడ్నీ బాధితులు

Women Died with Kidney Diesease in West Godavari - Sakshi

వైద్యం అందక మహిళ మృతి

పశ్చిమగోదావరి, కుక్కునూరు: కుక్కునూరు మండలం పెద్దరావిగూడెం గ్రామంలో కిడ్నీ వ్యాధితో పల్లాల లక్ష్మి (41) సోమవారం మృతి చెందింది. ప్రస్తుతం మరికొంతమంది గ్రామస్తులు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న విషయం వైద్యాధికారులు గత నెలలోనే గుర్తించారు. కొందరు బాధితులను ఇటీవల గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించారు. అక్కడ టెస్ట్‌లు నిర్వహించిన వైద్యులు లక్ష్మికి రెండు కిడ్నీలు పాడయ్యాయని, వారానికి నాలుగుసార్లు డయాలసిస్‌ చెయ్యాలని తేల్చారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారని లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా ఇక్కడి వైద్యులు ట్యూబ్‌ వేయించుకుంటే తప్ప డయాలసిస్‌ చెయ్యలేమన్నారని, దీంతో బయట ట్యూబ్‌ వేయించాలంటే రూ.15 వేలు ఖర్చవుతుందనడంతో డబ్బులు లేక ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. దీంతో వ్యాధి ముదిరి లక్ష్మి సోమవారం మరణించిందని తెలిపారు. గుంటూరు వెళ్లిన మిగిలిన వారు కూడా స్వగ్రామానికి తిరిగి వచ్చేసినట్టు స్థానికులు తెలిపారు.

కిడ్నీ సమస్యలకు కారణాలను తేల్చాలి : పెద్దరావిగూడెం గ్రామంలో రెండేళ్ల క్రితం కిడ్నీ వ్యాధితో నలుగురు మృతిచెందడం సంచలనమైంది. ఈ విషయమైపత్రికలలో కథనాలు కూడా వచ్చాయి. అప్పుడు పెద్దరావిగూడెం గ్రామంలో నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నీటి వల్ల ఆ వ్యాధి రాలేదని తేల్చారు. మరి కిడ్నీ సమస్య రావడానికి కారణాలు ఏమిటన్నది గ్రామస్థులకు అర్థం కావడంలేదు. అది తేల్చాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కిడ్నీ వ్యాధులకు గల కారణాలు ఏంటో తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వైద్య సిబ్బందిని పంపిస్తాం
పెద్దరావిగూడెం గ్రామంలో కిడ్నీ పాడై మహిళ మృతిచెందిన విషయం నా దృష్టికి కూడా వచ్చింది. వైద్య సిబ్బందిని మంగళవారం ఆ గ్రామానికి పంపిస్తాం. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారితో మాట్లాడతాం. ఆ సమస్య ఎందుకు వస్తున్నదో తెలుసుకుని నివారణ చర్యలు చేపడతాం.– వంశీలాల్‌ రాథోడ్,డివిజినల్‌ ప్రత్యేక వైద్యాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top