అక్రమాల్లో అంతా ‘నవీన’మే

Women And Child Development Department Building Demolished TDP Pylon Built In Est Godavari  - Sakshi

జెడ్పీలో అంతా అడ్డగోలుతనమే

కొత్తగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌కు జ్యోతుల నవీన్‌కుమార్‌ పేరు

శత వసంతాల పైలాన్‌ కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భవనం కూల్చివేత

2 వేల గజాల స్థలం 99 సంవత్సరాలకు టీడీపీకి లీజు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్‌ పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజల కోసం ఏమి చేశారా అంటే ఒక్కటి కూడా కనిపించకపోగా మరకలే అధికంగా వెక్కిరిస్తున్నాయి. నిధుల దుర్వినియోగం, ఆస్తుల ధారాదత్తం, స్వప్రయోజనాలకు వేదికగా మార్చుకోవడం తప్ప చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి.  ప్రజలకు చేసిందేమీ లేకపోగా అన్నీ అడ్డగోలు పనులకు శ్రీకారం చుట్టి అవినీతికి కేంద్రంగా మార్చేశారు. చంద్రన్నబాట పేరుతో అక్రమబాటలు వేసుకున్నారు... బదిలీలు, పదో న్నతులు పేరుతో దండిగా సంపాదించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తెప్పించుకోకపోగా ఉన్న నిధులను, ఆస్తులను ఊడ్చేసే పనులపైనే ఆసక్తి చూపిం చారు. చెప్పాలంటే జెడ్పీ ఖజానాను ఖాళీ చేసేశారు. గత ప్రభుత్వం అనేక నిధుల్ని నిలిపేసి, మరికొన్ని నిధులను మళ్లించింది.

కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే పరిమి తమైన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ప్రభుత్వ విధానాలకిందకొస్తాయి. కానీ ఆస్తులను కాపాడాల్సిన పాలకవర్గం తమ పార్టీ అధినేతకు విధేయతగా ఉండాలని విలువైన జెడ్పీ ఆస్తిని అప్పనంగా పార్టీ కార్యాలయం కోసం కట్టబెట్టారు. 2 వేల గజాల స్థలాన్ని 99 సంవత్సరాల లీజుకని ఇచ్చేశారంటే ఇక జెడ్పీ దాన్ని వదులుకోవల్సిందే. సంవత్సరానికి రూ.25 వేల అద్దెకింద విలువైన స్థలాన్ని సమర్పించేశారు. విశేషమేమిటంటే ఇదే జెడ్పీ స్థలంలో ఉన్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ భవనాన్ని తమ అవసరాల కోసమని ఖాళీ చేయించి, కూల్చేచారు. శత వసంతాల వేడుక ఫైలాన్‌ కోసమని స్త్రీ, శిశు సంక్షేమశాఖకు నిలువ నీడ లేకుండా చేసేశారు. ప్రభుత్వ కార్యాలయం ఉన్న స్థలాన్ని పైలాన్‌ కోసం వినియోగించగా, ఖాళీగా ఉన్న స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించేశారు.

రెండేళ్ల పదవికే అంత సీన్‌
సాధారణంగా జిల్లాకు మేలు చేసిన వారినో, అభివృద్ధికిపాటు పడిన వారినో, జెడ్పీ గుర్తింపు కోసం కృషి చేసిన వారినో గుర్తించి, వారికో గౌరవం కల్పించడం సంప్రదాయం. కానీ పార్టీ ఫిరాయించి చైర్మన్‌ పదవి పొందిన జ్యోతుల నవీన్‌కుమార్‌ పేరును ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌కు పెట్టడం విమర్శలకు గురవుతోంది. రేండేళ్ల కాలానికే ఇంత చేసి చెడ్డపేరును మూటగట్టుకున్నారు.

పార్టీ ఫిరాయించి...
జ్యోతుల నవీన్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీగా ఎన్నికై చైర్మన్‌ పదవి కోసం మూడేళ్ల కిందట టీడీపీలోకి ఫిరాయించారు. రెండేళ్ల కిందట జెడ్పీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ పదవి వెలగబెట్టింది కేవలం రెండేళ్లే. ప్రజా సేవతో ప్రజల్లో తన పేరును చిరస్థాయిగా నిలుపుకోవల్సిందిపోయి ప్రజాధనంతో కొత్తగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ‘జ్యోతుల నవీన్‌ కుమార్‌ కాంప్లెక్స్‌’గా నామకరణం చేశారు. గతంలో ఎంతోమంది పూర్తిస్థాయిలో చైర్మన్లుగా పని చేసి జిల్లాకు సేవలందించినవారున్నారు. కానీ వారెవరూ ఇంత చీప్‌ ట్రిక్స్‌కు దిగి తమ పేరున ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు. కేవలం రెండేళ్ల పదవిని చేపట్టిన ఈయన తన పేరిట ఏకంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం...
జ్యోతుల నవీన్‌కుమార్‌కు ముందు నామన రాంబాబు జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. అప్పటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజకీయంతో నామనకు ఎగనామం బెట్టి నవీన్‌కు పట్టం కట్టారు. జెడ్పీకి చెందిన రెండు వేల గజాల స్థలాన్ని టీడీపీకి నామన అప్పణంగా కట్టబెట్టేశారు. 99 ఏళ్ల లీజు పేరుతో, సంవత్సరానికి రూ.25 వేల అద్దె ప్రాతిపదికన టీడీపీ కార్యాలయం కోసం కోట్ల విలువైన స్థలాన్ని అర్పణం చేసేశారు. ఈ జెడ్పీ స్థలంలో టీడీపీకి  కార్యాలయం నిర్మించారు. స్వప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

భవనాన్ని కూల్చేసి...
జెడ్పీ చైర్మన్‌ నవీన్‌కుమార్‌ హయాంలో మరో ఘనకార్యం చేశారు. 70 ఏళ్లుగా ఉన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భవనాన్ని కూల్చేసి జెడ్పీ శతవసంతాల వేడుక పేరుతో పైలాన్‌ నిర్మించారు. టీడీపీ నాయకులతో కూడిన ఫొటోలతో రూ.15 లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టారు. దీంతో 5452 అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు సొంత గూడు లేకుండా పోయింది. జెడ్పీ వందేళ్ల వేడుక సందర్భంగా పైలాన్‌ ఏర్పాటు కోసం టీడీపీ నాయకులు ఆగమేఘాలపై 2018 ఏప్రిల్‌ 14న భవనాలు ఖాళీ చేయించారు. వెనువెంటనే దానిని కూల్చి వేయించి పైలాన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. విశేషమేమిటంటే రెండేళ్ల కిందట అదే స్త్రీ, శిశు సంక్షేమ భవనాన్ని రూ.5 లక్షలతో ఆధునికీకరించారు. ఇంకా దారుణమేమిటంటే బలవంతంగా ఖాళీ చేసేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ప్రస్తుతం అద్దె భవనంలో ఉంటోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top