పేదింటి దీపం.. సర్కారు అభయం

Woman Injured In A Car Accident On A Flyover In Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌ పైనుంచి కింద పడిన కారు 

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ‘అనంత’ యువతి 

ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితి  

స్పందించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 

చికిత్సకయ్యే ఖర్చు మొత్తం చెల్లించేందుకు హామీ

 ‘నాన్నా.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం వచ్చింది. మన కష్టాలు తీరినట్టే. అన్నట్టు అమ్మకు కూడా ధైర్యం చెప్పు. తమ్ముడు ఎలాఉన్నాడు..’ అంతలోనే పెద్ద శబ్ధం. అవతిలి నుంచి ‘నాన్నా చనిపోతున్నా.. యా అల్లా కాపాడండి’ అంటూ బిడ్డ కుబ్రా ఫోన్‌ కాల్‌ కట్టయ్యింది. అంత వరకు కూతురు చెబుతున్న విషయం ఆనందంతో వింటున్న తండ్రి అబ్దుల్‌ అజీంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఆరు గంటల తర్వాత విషయం తెలిసి నిలువునా కుప్పకూలిపోయాడు. తేరుకుని హడావుడిగా హైదరాబాద్‌ వెళ్లగా కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్న ఆయనకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని భోరసా ఇచ్చారు. – అనంతపురం కల్చరల్‌ 

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్‌పై వేగంగా వెళుతూ కారు కిందపడిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆ పక్కనే ఉన్న అనంతపురం నగరానికి చెందిన పాతికేళ్ల ముస్లిం యువతి కుబ్రా తీవ్రంగా గాయపడింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా రెండు నెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన కుబ్రా శనివారం కూడా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగం సాధించింది. ఆ సంతోషాన్ని తండ్రితో పంచుకుంటున్న సమయంలోనే ఓ కారు పైనుంచి వచ్చి పడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన కుబ్రా.. ప్రస్తుతం హైదరాబాద్‌ గచ్చిబౌలి సమీపంలోని కేర్‌ హాస్పిటల్‌లో జీవన్మరణ పోరాటం చేస్తోంది. 

చిన్నప్పటి నుంచీ కష్టించే తత్వం 
అనంతపురం ఆజాద్‌ నగర్‌కు చెందిన అబ్దుల్‌ అజీం, షాహిదా దంపతులకు కుబ్రా, అబ్దుల్‌ ఖాదర్‌ సంతానం. అజీం పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తొలిసంతానంగా కూతురు పుట్టడంతో మురిసిపోయిన అబ్దుల్‌ అజీం...దేవుడు తనకిచ్చిన ఘనమైన బహుమతి అనుకున్నాడు. అందుకే కూతురు పేరును కుబ్రా (ఘనమైనది) అని పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచాడు. కుబ్రా కూడా చిన్నతనం నుంచి ఎంతో కష్టించే మనస్ధత్వం కావడంతో అన్నిట్లోనూ రాణించేది. 1 నుంచి 10 వ తరగతి వరకు జూనియర్‌ కాలేజ్‌లోని ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఇంటర్‌ సెయింట్‌ ఆన్స్‌లో, బీటెక్‌ ఇంటెల్‌ కాలేజీలో చదివింది. ఇల్లు గడవడమే కష్టమైనా అబ్దుల్‌ అజీం కూతురును ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె చదువుల కోసం అప్పులు చేశాడు. ఏది అడిగితే అది సమకూర్చేవాడు.

ఈ క్రమంలోనే కుబ్రా ఇంజనీరింగ్‌ పూర్తి చేసి బెంగళూరులో కంప్యూటర్‌ కోర్సు నేర్చుకోవాలని చెబితే... అప్పు చేసి మరీ హాస్టల్లో ఉంచి చదివించాడు. మరో రెండు నెలలు హైదరాబాదులో ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్లాలంటే అక్కడ కూడా హాస్టల్లోనే ఉండడానికి ఒపుకున్నారు. ఏమైతేనేం కూతురుకి మంచి ఉద్యోగం వస్తే అదే చాలనుకున్నాడు. అనుకున్నట్టే బిడ్డ ఉద్యోగం సాధించగా...ఆ వార్త విన్న క్షణాల్లోనే ఆమె ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరడంతో అజీం గుండె ఆగినంత పనైంది. చికిత్స కోసం ఇప్పటిికే రూ.లక్ష ఖర్చు కాగా... వెన్నెముకకు ఆపరేషన్‌కు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి అల్లాడిపోయాడు. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. 

తల్లడిల్లుతున్న బంధువులు 
కుబ్రా తల్లి తరఫు చుట్టాలందరూ అనంతపురంలోనే వేర్వేరు ప్రాంతాల్లో కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బంధువులందరికీ నోట్లో నాలుకగా ఉండే ‘కుబ్రా’ ప్రమాదానికి గురైందని తెలియగానే ఆరో రోడ్డులో ఉన్న వాళ్ల పెద్దనాన్న సయ్యద్‌ బాషా, పెద్దమ్మ సైరాభాను తల్లడిల్లిపోయారు. తమ కూతురును కాపాడాలని అయినవారందరినీ వేడుకుంటున్నారు. చికిత్సకు ఆర్థిక సాయం చేయాలని ఎమ్మెల్యే, ఎంపీల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞాపన పత్రాలను పంపించారు. 

ఆజాద్‌ నగర్‌లోని కుబ్రా కుటుంబం అద్దెకుంటున్న ఇల్లు 

కుబ్రాకు సర్కార్‌ అండ 
అనంతపురం సప్తగిరి సర్కిల్‌: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనంతపురానికి చెందిన కుబ్రాకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కుబ్రా ఆరోగ్య స్థితి.. ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితిని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణం స్పందించారు. యువతికి వైద్య చికిత్స జరిగేలా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరంలోని ఆజాద్‌ నగర్‌లో నివాసముంటున్న అబ్దుల్‌ అజీం పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె ఖతిజతుల్‌ కుబ్రా బీటెక్‌ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు చేరుకుని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. గత శనివారం ఓ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగానికి కూడా ఎంపికైంది. ఈ సంతోషకరమైన విషయాన్ని అనంతపురంలో ఉన్న తన తండ్రికి సెల్‌ఫోన్‌లో చెబుతున్న సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పైనుంచి కారు పడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుబ్రా చావుబతుకుల మధ్య పోరాడుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇప్పటికే రూ.లక్షకు పైగా ఖర్చు అయ్యింది. అయితే కుబ్రా వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అసలే పేదరికంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ప్రాథమిక వైద్యం కోసం ఉన్న డబ్బును ఖర్చు చేసి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విషయం తెలుసుకున్న అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వెంటనే విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం తక్షణ వైద్యానికి చర్యలు చేపట్టారు. సదరు ఆసుపత్రికి యువతి వైద్యానికి సంబంధించిన ఎల్‌ఓసీ(లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) పంపారు. యువతి ఆపరేషన్‌కు ఎంత ఖర్చయినా భరిస్తామని తెలియజేశారు. ఇదిలా ఉండగా కుబ్రాకు మంగళవారం ఆపరేషన్‌ చేస్తారని ఆమె సోదరుడు ఖలీఖ్‌ తెలిపారు. 

సీఎం స్పందన ఆనందం కలిగిస్తోంది 
భగవంతున్ని బాగా నమ్మిన కుటుంబాలలో మా చెల్లెలు పిల్లలు కూడా ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని చెప్పేది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి స్పందించిన తీరు ఎంతో ఆనందం కలిగిస్తోంది.  
– సయ్యద్‌బాషా, ఆటో డ్రైవర్‌ 

ఆశలకు జీవం పోస్తున్న ముఖ్యమంత్రి
కుబ్రాను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం తరపున భరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడం కష్టాల్లో అండగా నిలిచే ఆయన మనస్థత్వానికి అద్దం పడుతోంది. ఈ నిర్ణయం ఆమె ఆశలకు జీవం పోస్తుంది.                
– షేక్షావలి, ఐదవరోడ్డు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top