చంపుతున్న స్వైన్‌ఫ్లూ

Woman Died With Swine Flu in East Godavari - Sakshi

జిల్లాలో ఈ సీజన్‌లో ఇద్దరు బలి..

ప్రాణాలు పోతున్నా పట్టించుకోని జీజీహెచ్‌ అధికారులు

అంతంతమాత్రంగా వార్డు ఏర్పాటు

స్వైన్‌ ఫ్లూ నిర్ధారణ పరీక్ష ల్యాబ్‌ కరువు

తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: జిల్లాలో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. రెండో రోజుల్లో ఇద్దరు ఈ వ్యాధి లక్షణాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన తిరుమనాథం వీరవెంకట సత్యనారాయణమ్మ (36) స్వైన్‌ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం మృతి చెందింది. అలాగే బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన బొండా మేరీ (34) అనే ఆమె అక్టోబర్‌ 30న కాకినాడ జీజీహెచ్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో చేరగా, ఆమెకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించడంతో బుధవారం రాత్రి టెస్ట్‌లకు బ్లడ్‌ శాంపిళ్లు తీసి విశాఖపట్నం పంపారు. ఈలోపే ఆమె గురువారం ఉదయం చనిపోయింది. డాక్టర్లు స్వైన్‌ఫ్లూ అనే అనుమానమే తప్ప, రిపోర్టు రాలేదని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలతో రాజమహేంద్రవరంలో ఇద్దరు, కాకినాడ రూరల్‌ మండలంలోని ఒకరు, అల్లవరం మండలం కొమరిగిరిపట్నానికి చెందిన ఒక మహిళ స్వైన్‌ఫ్లూ బారిన పడి కాస్త కుదుటపడి ఇళ్లకు చేరుకున్నారు.

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ లక్షణాలు స్పష్టంగా కన్పిస్తున్నా అధికార యంత్రాంగం చీమకుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజమహేంద్రవరం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాలకు పరిమితమైన ఈ స్వైన్‌ఫ్లూ కేసులు నేడు అమలాపురం, బిక్కవోలు, కాకినాడ సిటీ నియోజకవర్గాల పరిధిలో కనిపిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కనీసం స్వైన్‌ఫ్లూకి సంబంధించి పరీక్ష ల్యాబ్‌ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలతో స్వైన్‌ప్లూ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని చెబుతున్న వైద్యాధికారులు కేసుల వస్తే వారికి కనీసం వెంటిలేటర్లు కూడా అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి తోడు ఒక వార్డునే కేటాయించారు. ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు కేసులు నమోదయ్యాయి.

పేరు వింటేనే హడల్‌
కొన్ని రోజులుగా చల్లటి వాతావరణం నెలకొనడంతో హెచ్‌–1ఎన్‌–1 వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. చలితోపాటు గాలులు వీస్తుండడంతో జలుబు, చలి జ్వరం, లక్షణాలతో ఉన్నవారు పెరుగుతున్నారు. వారిలో హెచ్‌–1ఎన్‌–1 వైరస్‌ కారక క్రిములు వృద్ధి చెందుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌ప్లూయంజా ఏ అనే వైరస్‌ వల్ల వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కేవలం గాలి వాహకంగా వ్యాప్తి చెందే స్వైన్‌ఫ్లూ జ్వరంలా మొదలై ఊపిరితిత్తుల అంతర భాగంలోకి పాకడం వల్ల అది ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. సకాలంలో మెరుగైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలుంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోయినా ప్రధానంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారినా వెంటనే దగ్గర్లో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా మధుమేహం, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా రోగులు, ఇతరుల కంటే ఈ వైరస్‌ సోకడానికి దాదాపు 80శాతం అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.

బలభద్రపురానికి చెందిన మహిళ మృతి
బిక్కవోలు (అనపర్తి): స్వైన్‌ఫ్లూతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బలభద్రపురం ఎస్సీ పేటకు చెందిన బి.మేరి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. వారం రోజుల పాటు అనపర్తి సీహెచ్‌సీ, కాకినాడ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న ఆమె బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. ఆమె రక్తం, కళ్లె పరీక్షల నిమిత్తం విశాఖపట్నం పంపించగా గురువారం రిపోర్టులు రావలసి ఉంది. అయితే ఇంతలోనే ఆమె మృతి చెందింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు చంద్రకుమారి గురువారం ఎస్సీపేటలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 74 మందిని పరీక్షించగా నలుగురికి జ్వరం సోకినట్టు గుర్తించి వైద్య సహాయం అందజేస్తున్నట్టు తెలిపారు. అయితే పారిశుద్ధ్య లోపంతో పాటు వైద్య ఆరోగ్యశాఖాధికారుల ఉదాసీనత కారణంగానే మేరికి ప్రాణాంతక వ్యాధి సోకి మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాధులు ఉధృతంగా ఉండే ఈ రోజుల్లోనైనా పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖాధికారులు సమన్వయంతో పని చేసి ప్రాణాంతక రోగాల నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు.

వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్‌ చంద్రకుమారి
ప్రత్యేక వార్డు ఏర్పాటు
జనరల్‌ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానితులు, పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశాం. వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాం. జనసంచారం, సమూహం వద్ద మాస్కులు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా చేతిని అడ్డుపెట్టుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. – డాక్టర్‌ టీఎస్‌ఆర్‌ మూర్తి, జిల్లా వైద్యాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top