మహిళా కార్టూనిస్టు రాగతి పండరి కన్నుమూత


 విశాఖపట్నం: వ్యంగ్య చిత్రాలతో తెలుగు పాఠక లోగిళ్లను దశాబ్దాలపాటు గిలిగింత లు పెట్టిన మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి(50) గురువారం విశాఖపట్నంలో మృతి చెందారు. కొద్ది నెలలుగా ఆమె ఊపిరితి త్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె తల్లి శాంతికుమారి మృతి చెందటంతో సోదరుడు రామరాజు, సోదరి రమాతో కలసి ఉంటున్నారు. రాగతి పం డరి 1965 జూలై 22న విశాఖపట్నంలో జన్మించారు. చదువు ఇంటి వద్దనే కొనసాగింది. చిన్న వయసులోనే పోలియో సోకటంతో ఏర్పడిన శారీరక లోపం ఆమెలో పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇంట్లో సాహితీ అభిమానులు ఉండటం, పుస్తకాల సాయంతో బొమ్మలు గీయటం ఆరంభించారు. బాల్యంలోనే వారపత్రికల్లో ఆమె వ్యంగ్య చిత్రాలు ప్రచురితమయ్యాయి. రాశి లోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన ఏకైక మహిళా కార్టూనిస్టుగా గుర్తింపు పొందారు. మహామహులను సైతం ఆమె ప్రతిభ ముగ్ధులను చేసింది. కార్టూన్లు సాధన చేసిన తొలి రోజుల్లో తాను గీసిన చిత్రాలను ఆమె చెన్నైలో నివసించే కార్టూనిస్టు జయదేవ్‌కు పంపారు. చాలాకాలం తరువాత జయదేవ్ జవాబు రాస్తూ ఆమె కార్టూన్లను మెచ్చుకుని సలహాలు, సూచనలు చేశారు. పండరి మొదటి కార్టూన్ ఆమె ఎనిమిదో ఏటే జ్యోతి వార పత్రికలో ప్రచురితమైంది. మొదటి కార్టూన్‌కు ఆమెకు లభించిన పారితోషికం నాలుగు రూపాయలు. ఇప్పటివరకూ 16 వేలకు పైగా  కార్టూన్లు గీశారు. 2005లో రచన మాస పత్రికలో వినాయక చవితి సందర్భంగా ప్రచురితమైన పండరి కార్టూన్‌కు బాపు బొమ్మ గీశారు. బాపు, జయదేవ్‌ల శిష్యురాలిగా పండరి గుర్తింపు పొందారు. 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘కళారత్న’ పురస్కారాన్ని అందచేసింది. ఆమె రెండు పుస్తకాలు కూడా రచించారు. పండరి గీసిన రెండు వందల కార్టూన్లతో కూడిన ‘నవ్వుల విందు’ పుస్తకాన్ని ప్రచురించారు. 2008 లో ‘నాగురించి నేను’ ఆత్మకథ పుస్తకాన్ని ప్రచురించారు.

 అవయవ దానం: మరణానంతరం తన కళ్లు, ఇతర శరీర అవయవాలను దానం చేయాలని రాగతి పండరి సంకల్పించారు. ఈ మేరకు అవయవాల సేకరణకు వీలుగా ఆమె పార్థివదేహాన్ని ఆంధ్రప్రదేశ్ శరీర దాతల సంఘం రాష్ట్ర కమిటీకి ఆమె కుటుంబసభ్యులు అప్పగించినట్లు కమిటీ ప్రతినిధులు రామ్‌ప్రభ, బాలభానులు ఒక ప్రకటనలో తెలిపారు.


 చంద్రబాబు, వైఎస్ జగన్ సంతాపం

 సాక్షి, హైదరాబాద్: కార్టూనిస్టు రాగతి పండరి మృతి పట్ల  ఏపీ సీఎం చంద్రబాబు,  వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలు వ్యంగ్య చిత్రాలతో తెలుగు పాఠకుల అభిమానాన్ని పండరి సొంతం చేసుకున్నారని జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top