చలికాలం పూర్తి కాకుండానే ఎండలు మండిపోతున్నాయి. ముందస్తు వేసవితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
	కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: చలికాలం పూర్తి కాకుండానే ఎండలు మండిపోతున్నాయి. ముందస్తు వేసవితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే భానుడు భగభగమంటుతుండటం చూస్తే.. ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఎలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది. గత ఏడాదితో పోలిస్తే ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు చలికాలం ఉంటుంది.
	 
	 ఈ సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటదు. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రత 36.1 డిగ్రీలకు చేరుకుంది. తెల్లవారుజామున తప్పిస్తే చలి ప్రభావం కనిపించడం లేదు. ఫ్యాన్లు, కూలర్లను సైతం ప్రజలు వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ముందస్తు వేసవితో శీతల పానీయాలతో పాటు టెంకాయలకు డిమాండ్ పెరుగుతోంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో గత ఏడాది అక్టోబర్ చివరి వరకు మాత్రమే వర్షాలు కురిసాయి. దాదాపుగా నాలుగు నెలల పాటు వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. 500 అడుగుల లోతు బోర్లు వేసినా చుక్కనీరు బయటకు రావడం లేదంటే భూగర్భ జలాలు ఏ స్థాయికి పడిపోయాయో తెలియజేస్తోంది.
	 
	 చెరువులు, కుంటల్లోను నీరు ఇంకిపోయింది. ఫలితంగా గాలిలో తేమ శాతం పడిపోయి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక పట్టణాల్లో వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో కాలుష్యం అధికమవుతోంది. ఈ ప్రభావం ఉష్ణోగ్రతలపైనా చూపుతోంది. మరో వారం పది రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
	 
	 శీతల పానీయాలకు డిమాండ్:
	 శంకర్, శీతల పానీయాల వ్యాపారి
	 నెల మొదట్లో శీతల పానీయాలకు అంతగా డిమాండ్ లేదు. నాలుగు రోజుల నుంచి వ్యాపారం 20 నుంచి 30 శాతం పెరిగింది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు.
	 
	 పొలం పనులు చేసుకోలేకపోతున్నాం:
	 మల్లికార్జున, డి.బెళగల్ గ్రామం, కోసిగి మండలం
	 వ్యవసాయ పనులు చివరి దశలో ఉన్నాయి. ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే ఎండలు పెరుగుతుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల తర్వాత ఎండలో పనులు చేసుకోవడం కష్టమవుతోంది. ఏప్రిల్, మే నెలలను తలచుకుంటేనే భయమేస్తోంది.
	 
	 భరించలేకున్నాం: మహబూబ్ బాషా, కర్నూలు
	 సాధారణంగా శివరాత్రి తర్వాత ఎండల ప్రభావం కనిపిస్తుంది. అలాంటిది నెల రోజుల ముందుగానే ఎండలు మండుతున్నాయి. చలి బాగా తగ్గిపోయింది. ఉదయం 10 గంటల నుంచే బయటకు రాలేకపోతున్నాం. ఇప్పుడే ఇలా ఉంటే.. ఉగాది తర్వాత ఎలా ఉంటుందో.
	 
	 టెంకాయల అమ్మకం పెరిగింది: మహేష్, వ్యాపారి
	 వారం రోజుల క్రితం వరకు రోజుకు 30 నుంచి 40 టెంకాయలు మాత్రమే అమ్మకమయ్యేవి. నాలుగైదు రోజుల నుంచి ఎండలు పెరగడంతో డిమాండ్ పెరిగింది. 60 నుంచి 70 కాయలు అమ్ముడవుతున్నాయి. ఎండలు ముందే రావడంతో ప్రజలు ఉపశమనం పొందేందుకు టెంకాయలను అధికంగా సేవిస్తున్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
