భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం


సరుబుజ్జిలి : మరో మహిళతో తన భర్త కాపురం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా భర్త ఇంటి ఎదుటే మౌన పోరాటానికి దిగింది. దీనికి రొట్టవలస గ్రామం వేదికైంది. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం వీరఘట్టం గ్రామానికి చెందిన శీరాపు నాగభూషణరావు, శ్రీదేవిల ఏకైక కుమార్తె మాధురిని రొట్టవలస గ్రామానికి చెందిన కొన్న రామ్మూర్తి, మీనాక్షి దంపతుల రెండో కుమారుడు వసంతకుమార్‌కు ఇచ్చి 2014 ఆగస్టు 14వ తేదీన వివాహం జరిపించారు. వసంతకుమార్ గ్రామంలో ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో పదకొండున్నర లక్షల రూపాయలను వసంతకుమార్‌కు ఇచ్చారు.

 

 ఇదిలా ఉండగా.. పెళ్లయిన రెండు నెలల తరువాత మాధురి, వసంతకుమార్ దంపతులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అక్కడ నుంచి మాధురి కన్నవారికి ఎటువంటి ఫోన్‌గాని, ఇతర సమాచారం రాలేదు. అదే ఏడాది డిసెంబర్ రెండో తేదీన తమ కుమార్తె మాధురితో ఫోన్ చేయించి అంతా బాగానే ఉన్నామని చెప్పమన్నాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఇదే క్రమంలో కోటబొమ్మాళి మండలం సాలిపేట గ్రామానికి చెందిన ఓ వివాహితను కూడా తమ అల్లుడు వసంతకుమార్ హైదరాబాద్ రప్పించుకుని ఆమెతో కాపురం చేస్తున్నాడని, అప్పటి నుంచి తమ కుమార్తెను పట్టించుకోవడం మానేశాడని మాధురి తల్లిదండ్రులు ఆరోపించారు.

 

 ఈ విషయమై ఎన్నిసార్లు తమ అల్లుడిని ప్రశ్నించినా స్పందించలేదన్నారు. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా పట్టించుకోకపోవడంతో మాధురి కొద్ది నెలలుగా కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ మాధురి, ఆమె తల్లిదండ్రులు వసంతకుమార్ ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని మాధురి భర్త వసంతకుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తన భార్య సక్రమంగా తనపట్ల ఉండక పోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. వేరొక అమ్మాయితో అకారణంగా కొంతమంది తనను ఇరికించినట్టు చెప్పారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top