
కర్ణాటక: కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడి ఇంటినుంచి గెంటేయడంతో భార్య నిరాహార దీక్షకు దిగింది. ఈఘటన తుమకూరు నగరంలో జరిగింది. షష్టగిరి బ్లాక్‌కు చెందిన ప్రజ్వల్ శంకర్‌కు 2024లో తాలూకాలోని చిక్కనాయకనహళ్లికి చెందిన ప్రేరణతో వివాహమైంది. పెళ్లయిన నాలుగు రోజులనుంచే ప్రేరణకు వేధింపులు మొదలయ్యాయి.
ఇన్నాళ్లూ ఓర్చుకున్న ఆమె దిక్కుతోచని స్థితిలో ధర్నాకు దిగి న్యాయం చేయాలని కోరుతోంది. బాధితురాలు మాట్లాడుతూ ప్రజ్వల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా తన భర్త ఖాళీగా ఉంటున్నాడని తెలిపింది. వివాహమైన అనంతరం ఎనిమిది నెలలు మాత్రమే అత్తగారింట్లో ఉన్నానని, వేధింపులు తాళలేక గతంలో ఒక పర్యాయం ఇంటి ముందు ఆందోళనకు దిగానని, ఎవరూ పట్టించుకోలేదన్నారు.
తాజాగా తనను బయటకు గెంటేయడంతో న్యాయం కోసం ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. తన వివాహం కోసం తన తండ్రి లక్ష రూపాయలు అప్పులు చేశాడన్నారు. తన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారం, వెండి తన అత్తవారి ఇంటిలో ఉన్నాయని, వాటిని ఇస్తే తన తండ్రి చేసిన అప్పులు తీర్చాలని ఉందన్నారు. భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయింది. తన గోడును మహిళా కమిషన్‌కు కూడా తెలిపానని పేర్కొంది.