భర్త కోసం అత్తింటి వద్ద పోరాటం

Wife Protest Infront Of Husband House East Godavari - Sakshi

తూర్పుగోదావరి ,తోకాడ (రాజానగరం): ప్రేమించాడు .. పెళ్లి చేసుకున్నాడు .. కాపురం పెట్టాడు.. ఒక పాప పుట్టింది.. అంతే జాడ లేకుండా పోయాడు. అలా ఓ మగాడి మాయలోపడి మోసపోయిన వివాహిత తన బిడ్డకు తండ్రి కావాలని, తన భర్తను అప్పగించాలని కోరుతూ అత్తింటి ఎదుట చంటి బిడ్డతో  నిరాహార దీక్ష చేపట్టింది. ఆమెకు రాజమహేంద్రవరానికి చెందిన పలు మహిళా సంఘాల సభ్యులు మద్దతుగా నిలిచారు. బాధితురాలు సూరిశెట్టి సుమలత తెలిపిన వివరాల ప్రకారం సీతానగరం మండలం, పురుషోత్తపట్నానికి చెందిన సుమలత రాజమహేంద్రవరంలో నర్సింగ్‌ చదువుతుండగా గైట్‌ కళాశాలలో డిప్లమా చేస్తున్న తోకాడకు చెందిన గండి çసత్యశివకుమార్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా వర్థిల్లింది. వారిద్దరూ రెండేళ్లు అలా ప్రేమించుకుంటూ ఎన్నో బాసలు  చేసుకున్నారు. సుమలత బీసీ (వాడబలిజ), శివకుమార్‌ ఓసీ (కాపు) సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో తల్లిదండ్రులు అంగీకరించరని 2016 జూన్‌ 25న తంటికొండలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ రహస్యాన్ని కొనసాగిస్తూ రాజమహేంద్రవరంలో ఐఎల్‌టీడీ వద్ద అంబికానగర్‌లో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు.

వారికి ఒక పాప పుట్టింది. అంతే..  ఆ తర్వాత శివకుమార్‌ ఇంటికి రావడం మానేశాడు. భర్త కోసం రెండు నెలలు నిరీక్షించిన సుమలత పాప పుట్టిన విషయాన్ని తోకాడలోని అతని తల్లిదండ్రులైన గండి వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మిలకు ఫోన్‌ చేసి చెప్పింది. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో తన తల్లిదండ్రులతో తోకాడ వచ్చి గ్రామ సర్పంచ్‌ను కలుసుకుని జరిగిన విషయాన్ని తెలియజేసింది. అక్కడ నుండి అత్తింటికి వెళ్లింది. అయితే వారు ఆమెను ఇంటిలోకి రానీయకపోగా నీవెవరు? నీ కులం ఏమిటి? అంటూ దుర్భాషలాడారు. ఆ విషయాన్ని  తేల్చుకునేందుకు  శివకుమార్‌ను తీసుకుని అతని తల్లిదండ్రులు సీతానగరం వచ్చి, పెద్దల్లో పెట్టారు. అప్పుడు శివకుమార్‌ వింతగా ప్రవర్తిస్తూ ‘ఈ పాప నాకు పుట్టింది కాదు. నీకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు. నీవెవరో నాకు తెలియదు. నీతో ఉంటే చచ్చిపోతా’నంటూ పరుగు తీశాడు. అతని వెనుకనే వెంట వచ్చిన వారు కూడా వెళ్లిపోయారని సుమలత తెలిపింది.

అప్పటి నుండి ఇప్పటి వరకు అతని జాడ లేదు. ఆ నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని మహిళా మండలి సభ్యులను సుమలత సంప్రదించింది. వారి సాయంతో గురువారం తోకాడలోని అత్తింటికి వచ్చింది. ఉదయం 10 గంటలకు వస్తే లోపలకు కూడా రానీయకుండా, నానా దుర్భాషలాడుతూ ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకున్నారని సుమలత తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె పేర్కొంది. ‘నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేసినా మాకు భయం లేదు. నీవు ఏమీ చేయలేవు’ అని అత్తింటివారు బెదిరిస్తున్నారని సుమలత వాపోయింది.  తన భర్త ఎక్కడికీ పోలేదని, కాకినాడలో వాళ్ల బంధువుల ఇంట ఉన్నాడనే  అనుమానాన్ని వ్యక్తం చేసింది.

మా పరువు తీశాడు.. అందుకే వెదకడం లేదు
‘మా పరువు పోయేవిధంగా వ్యవహరించాడు కాబట్టే మా అబ్బాయి ఎనిమిది నెలలుగా కనిపించకుండా పోయినా పట్టించుకోలేదు’ అని శివకుమార్‌ తల్లి వెంకటలక్ష్మి వివరణ ఇచ్చారు. వాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ఆ రోజు సీతానగరంలో పెద్దల్లో పెట్టాం రండి అంటే వెళ్లాం. అక్కడ నుంచి వెళ్లిపోయిన మా అబ్బాయి ఇప్పటికీ తిరిగి రాలేదు. పోలీసు ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ అమ్మాయి, మా వాడు పెళ్లి చేసుకున్నట్టు కూడా మాకు తెలియదు. ఈ అమ్మాయే కొన్ని ఫొటోలు ఫేస్‌ బుక్‌లో పెట్టడంతో వాళ్లు వీళ్లు వచ్చి అడగడంతో తెలిసింది. అప్పటికే మా అబ్బాయి మా నుంచి వెళ్లిపోయాడు.’ అని ఆమె తెలిపారు.  ‘ ఈ అమ్మాయికి అప్పటికే ఒకసారి పెళ్లి అయింది. పెళ్లి కానట్టు నటించి మా అబ్బాయిని ప్రేమ పేరుతో మోసం చేసింది’ అని శివకుమార్‌ తల్లి ఆరోపించారు.

న్యాయం జరిగే వరకు కదిలేది లేదు
సుమలతకు న్యాయం జరిగేవరకు ఇక్కడ నుండి కదిలేది లేదని ఆమెకు మద్దతుగా వెంట వచ్చిన మహిళా సంఘాల సభ్యులు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ పోరాట సంఘాల ప్రతినిధులు డోనుపాటి అనంతలక్ష్మి, టి. దుర్గ, ఎస్‌. రామలక్ష్మి, ఎం. జయలక్ష్మి, విజయశాంతి, తాటి లక్ష్మి, యండమూరి మేరి, తదితరులు సమలత పోరాటానికి మద్దతుగా నిలిచారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top